డీఎన్‌ఏ కలిపింది ఇద్దరినీ..

Take Action on Hospital Staff in Change DNA Report Case  - Sakshi

జగిత్యాల ఆస్పత్రిలో శిశువుల తారుమారు

15 రోజుల నిరీక్షణకు తెర ఎవరి శిశువులు వారికి అప్పగింత

నలుగురిపై చర్యలకు జేసీ ఆదేశం

జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గతనెల 21న శిశువుల మార్పిడి జరిగిందనే అనుమానాలు నిజమయ్యాయి. 15 రోజుల అనంతరం డీఎన్‌ఏ రిపోర్ట్‌లు రావడంతో బుధవారం ఎవరి శిశువులను వారికి అప్పగించారు. ఈ ఘటనపై జాయింట్‌ కలెక్టర్‌ రాజేశం, ఆర్డీవో నరేందర్‌ విచారణ చేపట్టారు. బాధ్యులైన నలుగురిపై సస్పెన్షన్‌కు ఆదేశించారు. బుగ్గారం మండలం మద్దునూర్‌కు చెందిన బొంగురాల చామంతి గతనెల 19న జగిత్యాల ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో మేడిపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన ఎర్ర రజిత సైతం మగబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే.. సిబ్బంది నిర్లక్ష్యంతో కవల పిల్లలంటూ ఇద్దరు శిశువులను రజిత కుటుంబసభ్యులకు అప్పగించారు. చామంతి కుటుంబ సభ్యులు తమ బిడ్డ ఏడని నిలదీయడంతో పొరపాటును గుర్తించిన సిబ్బంది.. వెంటనే రజిత వద్దనున్న రెండో బిడ్డను తీసుకొచ్చి వీరికి అందజేశారు. ఈ శిశువు తమ బిడ్డ కాదంటూ చామంతి కుటుంబ సభ్యులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో వైద్యసిబ్బంది డీఎన్‌ఏ రిపోర్ట్‌ తీసుకుంటే ఎవరి బిడ్డ అనేది తెలుస్తుందని తేల్చారు. ఈ క్రమంలో జూన్‌ 2న రిపోర్ట్‌లు వచ్చాయి.

సదరు ఆస్పత్రి సిబ్బంది మళ్లీ తప్పు చేశారు. శిశువుల మార్పిడి జరగలేదని పేర్కొన్నారు. అయితే.. చామంతి, మహేందర్‌ దంపతులకు మొదటి నుంచీ అనుమానాలు ఉండటంతో వారు కలెక్టర్‌ శరత్‌ను కలసి మొర పెట్టుకున్నారు. దీంతో ఆయన సమస్య పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించారు. జేసీ సమక్షంలో మళ్లీ శాంపిల్స్‌ తీసుకుని పంపించడంతో మంగళవారం రిపోర్ట్‌లు వచ్చాయి. శిశు మార్పిడి జరిగింది వాస్తవమేనని తేలింది. ఇరువురు దంపతులను ఆసుపత్రికి పిలిపించి.. ఎవరి బిడ్డలను వారికి అందించారు. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డుబాయి, ఆయాతోపాటు నర్సు, సూపరింటెండెంట్‌లపై చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు.

తల్లిదండ్రుల్లో ఆనందం
మద్దునూర్‌కు చెందిన బొంగురాల మహేందర్, చామంతి దంపతులు మాట్లాడుతూ మొదటి నుంచీ శిశుమార్పిడి జరిగిందని చెబుతున్నామని, డాక్టర్లు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 15 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉన్నామని, ఉన్న పొలాన్ని కుదవపెట్టి డీఎన్‌ఏ రిపోర్ట్‌ కోసం రూ.21 వేలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. మరో రూ.9 వేల వరకు శిశువు చికిత్స కోసం వెచ్చించామని తెలిపారు. డీఎన్‌ఏ రిపోర్ట్‌ కోసం ఇచ్చిన డబ్బులను ఇవ్వాలని చామంతి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. రెండు, మూడు రోజుల్లోగా ఖర్చులు ఇచ్చేలా చూస్తామని సూపరింటెండెంట్‌ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

సూపరింటెండెంట్‌ సమక్షంలో
శిశువులను మార్చుకుంటున్న తల్లిదండ్రులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top