breaking news
Infant changes
-
డీఎన్ఏ కలిపింది ఇద్దరినీ..
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గతనెల 21న శిశువుల మార్పిడి జరిగిందనే అనుమానాలు నిజమయ్యాయి. 15 రోజుల అనంతరం డీఎన్ఏ రిపోర్ట్లు రావడంతో బుధవారం ఎవరి శిశువులను వారికి అప్పగించారు. ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ రాజేశం, ఆర్డీవో నరేందర్ విచారణ చేపట్టారు. బాధ్యులైన నలుగురిపై సస్పెన్షన్‌కు ఆదేశించారు. బుగ్గారం మండలం మద్దునూర్‌కు చెందిన బొంగురాల చామంతి గతనెల 19న జగిత్యాల ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో మేడిపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన ఎర్ర రజిత సైతం మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. సిబ్బంది నిర్లక్ష్యంతో కవల పిల్లలంటూ ఇద్దరు శిశువులను రజిత కుటుంబసభ్యులకు అప్పగించారు. చామంతి కుటుంబ సభ్యులు తమ బిడ్డ ఏడని నిలదీయడంతో పొరపాటును గుర్తించిన సిబ్బంది.. వెంటనే రజిత వద్దనున్న రెండో బిడ్డను తీసుకొచ్చి వీరికి అందజేశారు. ఈ శిశువు తమ బిడ్డ కాదంటూ చామంతి కుటుంబ సభ్యులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో వైద్యసిబ్బంది డీఎన్ఏ రిపోర్ట్ తీసుకుంటే ఎవరి బిడ్డ అనేది తెలుస్తుందని తేల్చారు. ఈ క్రమంలో జూన్ 2న రిపోర్ట్లు వచ్చాయి. సదరు ఆస్పత్రి సిబ్బంది మళ్లీ తప్పు చేశారు. శిశువుల మార్పిడి జరగలేదని పేర్కొన్నారు. అయితే.. చామంతి, మహేందర్ దంపతులకు మొదటి నుంచీ అనుమానాలు ఉండటంతో వారు కలెక్టర్ శరత్‌ను కలసి మొర పెట్టుకున్నారు. దీంతో ఆయన సమస్య పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించారు. జేసీ సమక్షంలో మళ్లీ శాంపిల్స్ తీసుకుని పంపించడంతో మంగళవారం రిపోర్ట్లు వచ్చాయి. శిశు మార్పిడి జరిగింది వాస్తవమేనని తేలింది. ఇరువురు దంపతులను ఆసుపత్రికి పిలిపించి.. ఎవరి బిడ్డలను వారికి అందించారు. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డుబాయి, ఆయాతోపాటు నర్సు, సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తల్లిదండ్రుల్లో ఆనందం మద్దునూర్‌కు చెందిన బొంగురాల మహేందర్, చామంతి దంపతులు మాట్లాడుతూ మొదటి నుంచీ శిశుమార్పిడి జరిగిందని చెబుతున్నామని, డాక్టర్లు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 15 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉన్నామని, ఉన్న పొలాన్ని కుదవపెట్టి డీఎన్ఏ రిపోర్ట్ కోసం రూ.21 వేలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. మరో రూ.9 వేల వరకు శిశువు చికిత్స కోసం వెచ్చించామని తెలిపారు. డీఎన్ఏ రిపోర్ట్ కోసం ఇచ్చిన డబ్బులను ఇవ్వాలని చామంతి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. రెండు, మూడు రోజుల్లోగా ఖర్చులు ఇచ్చేలా చూస్తామని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సూపరింటెండెంట్ సమక్షంలో శిశువులను మార్చుకుంటున్న తల్లిదండ్రులు -
విజయవాడలో శిశువు మార్పిడి వివాదం
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శిశువు మార్పిడిపై వివాదం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళ ప్రసవించగా, ఆమెకు మగబిడ్డ పుడితే.. ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఆడపిల్ల పుట్టిందని చెప్పారంటూ మహిళ కుటుంబ సభ్యులు గురువారం ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బందిని గట్టిగా నిలదీస్తే చనిపోయిన మగశిశువును తమకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.