‘కాఫీ డే’ల్లో మధురస్మృతులు

Sweet Memories With Cafe Coffee Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా దాదాపు 200 అవుట్‌లెట్‌లు కలిగిన ‘కేఫ్‌ కాఫీ డే ’ వ్యవస్థాపకులు సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న విషాదాంత నేపథ్యంలో ‘కేఫ్‌ కాఫీ డే’లతో ప్రత్యక్ష అనుబంధం కలిగిన పలు వర్గాల భారతీయులు వాటితో పెనవేసుకున్న తమ మధురానుభూతులను సోషల్‌ మీడియా సాక్షిగా నెమరేసుకుంటున్నారు. వ్యాపార వర్గాలతోపాటు కాలేజీ యువతీ యువకులకు ఈ కాఫీ డేలతో ఎంతో అనుబంధం మిగిలి ఉంది. వ్యాపార రంగానికి చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు వీటిల్లో కూర్చుని కాఫీలు సేవిస్తూ వ్యాపార లావాదేవీలు నిర్వహించడంతోపాటు పలు భారీ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన యువతీ యువకుల మధ్య ఎక్కువ డేటింగ్‌లు మొదలయిందీ ఈ కాఫీ డేల నుంచే. చల్లటి సమయాల్లో వేడి వేడిగా దొరికే ఎక్స్‌ప్రెస్సో, కప్పూసినో, లట్టే, రోజ్‌ కారమెల్లర్, చకోలేట్‌ మొచే కాఫీలు సేవిస్తూ, అదే హాట్‌ హాట్‌ వెదర్‌లో చల్లటి ట్రాపికల్‌ ఐస్‌బెర్గ్, కూల్‌ ఎస్కినో, చోకో ఫ్రెప్పీ, కాపీ నిర్వహణ లాంటి రకాల కాఫీల రుచులను ఆస్వాదిస్తూ ఊసులాడుకున్న కబుర్లను వారు నేడు షేర్‌ చేసుకుంటున్నారు.

మానస వెంకటేష్‌ లాంటి వాళ్లు నాటి డేటింగ్‌ రోజులను గుర్తు చేస్తూ అందుకు అవకాశం కల్పించి నేడు మధ్య లేకుండా పోయిన సిద్ధార్థకు నివాళులు కూడా అర్పిస్తున్నారు. హైదరాబాద్‌ పట్టణానికి వచ్చి పారిశుద్ధ్యం సరిగ్గాలేని టాయ్‌లెట్లకు వెళ్లలేక సతమతమవుతున్న తన లాంటి మహిళలకు ఈ కాఫీ డేలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సుభా జే రావు లాంటి వాళ్లు ట్వీట్లు చేస్తున్నారు. దేశంలో సరికొత్త కాఫీ విప్లవాన్ని తీసుకొచ్చిన కాఫీ డేలకు తాము పది, పన్నెండేళ్ల క్రితం తరచుగా వెళ్లే వాళ్లమని, అప్పుడు ఏ కాఫీ అయినా 40 రూపాయలు ఉండేదని, ఇప్పుడు సమోసా కూడా 55 రూపాయలకు తక్కువకు దొరకడం లేదని ఐటీ రంగాన్ని కవర్‌ చేస్తూ వచ్చిన ఓ రిపోర్టర్‌ చెప్పారు. బెంగళూరులోని ఓ కాఫీ డేలో తన సమక్షంలోనే ఓ భారతీయ టాక్సీల కంపెనీ, మరో క్యాబ్‌ కంపెనీలో విలీనమయ్యే ఒప్పందాన్ని చేసుకుందని ఆయన తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ‘కాఫీ డే’లతో అనుబంధాలు ఎన్నో ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top