'బీజేపీ వెలిగిపోతోంది... నాలుగు రాష్ట్రాల్లో కమలానిదే అధికారం' | surveys say BJP will win in 4 states | Sakshi
Sakshi News home page

'బీజేపీ వెలిగిపోతోంది... నాలుగు రాష్ట్రాల్లో కమలానిదే అధికారం'

Dec 4 2013 6:50 PM | Updated on Mar 29 2019 9:18 PM

'బీజేపీ వెలిగిపోతోంది... నాలుగు రాష్ట్రాల్లో కమలానిదే అధికారం' - Sakshi

'బీజేపీ వెలిగిపోతోంది... నాలుగు రాష్ట్రాల్లో కమలానిదే అధికారం'

వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న తాజా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న తాజా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఓటర్లు కాంగ్రెస్కు మొండిచేయి చూపారని, బీజేపీ భారీ లబ్ది పొందుతుందని చెబుతున్నాయి. బీజేపీ మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రాజస్థాన్, ఢిల్లీల్లోనూ విజయదుందుబి మోగిస్తుందని పలు ఎగ్జిట్పోల్స్ సర్వేలు వెల్లడించాయి. ఈ లెక్కన కాంగ్రెస్ ఢిల్లీ, రాజస్థాన్లో అధికారం కోల్పోవడంతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లో మరో విడత ప్రతిపక్షంలో కూర్చోకతప్పదని జోస్యం చెబుతున్నాయి. ఈ ఫలితాలు లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో బుధవారం ఎన్నికలు ముగిసిన అనంతరం టైమ్స్ నౌ-సి ఓటర్, టుడేస్-చాణక్య, నీల్సన్ ఏబీపీ సర్వేలు ఫలితాలను వెల్లడించాయి.

90 శాసనసభ స్థానాలున్న చత్తీస్గఢ్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలూ వెల్లడించాయి. సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పాయి. బీజేపీ ప్రభుత్వానికి రమణ్ సింగ్ సారథ్యం వహిస్తున్నారు.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఎగ్జిట్పోల్స్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలో హంగ్ ఏర్పడుతుందని టైమ్స్ నౌ-సి ఓటర్ సర్వే పేర్కొంది. తాజా ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఏర్పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ కింగ్ మేకర్గా అవతరిస్తుందని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. బీజేపీ 29, కాంగ్రెస్ 21, ఏఏపీ 16, ఇతరులు నాలుగు అసెంబ్లీ స్థానాలు సాధిస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో ఏఏపీ ఎవరికి మద్దతిస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంటుంది. నీల్సన్ ఏబీపీ సర్వే బీజేపీకి 32 సీట్లు వస్తాయని తెలిపింది.

రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు పేర్కొన్నాయి. అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని వెల్లడించాయి. రాజస్థాన్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని టుడేస్-చాణక్య జోస్యం చెప్పింది. 130 నుంచి 150 స్థానాలు వరకు అసెంబ్లీ సీట్లు సాధిస్తుందని తెలియజేసింది. సీ ఓటర్ సర్వే కూడా దాదాపు ఇలాగే ఉంది.

మధ్యప్రదేశ్లోనూ శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం నిలబెట్టుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోకతప్పదని పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement