
సచివాలయ ఉద్యోగులకు వేధింపులు
పీ–4లో భాగంగా కొత్త సమాచార సేకరణకు ఆదేశాలు
శుక్ర, శని, ఆదివారం సెలవు రోజుల్లో పూర్తిచేయాలని
అధికారుల ఒత్తిడి లబోదిబోమంటున్న ఉద్యోగులు, సిబ్బంది
సాక్షి, అమరావతి: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు సెలవు రోజుల్లోనూ పనిభారం తప్పడం లేదు. పీ–4 కార్యక్రమంలో భాగంగా వారి చేత ఇప్పటికే మూడు, నాలుగు రకాల సర్వేలు చేయిస్తున్న ప్రభుత్వం తాజాగా నీడ్ అసెస్‌మెంట్ సర్వే పేరిట రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన దాదాపు 24 లక్షల కుటుంబాలకు ఏ రకమైన తొడ్పాటు కావాలో సమాచారం సేకరించాలని ఆదేశించింది.
ప్రస్తుతం శ్రావణ శుక్రవారం, రెండో శనివారం, ఆదివారం వరుసగా సెలవులు రావడంతో ఈ రోజుల్లో ఈ సర్వేను పూర్తిచేయాలని హుకుం జారీచేసింది. దీంతో ఉద్యోగులు సెలవులు తీసుకోకుండా అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సర్వేపై సీఎంతో కలెక్టర్ల సమావేశం ఉంటుందని, చెప్పిన సమయానికి సర్వే పూర్తిచేయాల్సిందేనని, లేకుంటే సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీ–4 కార్యక్రమంలోనే తొలుత పేదల(బంగారు కుటుంబాలు) గుర్తింపు, తర్వాత దత్తత తీసుకునే మార్గదర్శకుల గుర్తింపు సర్వేలు చేపట్టిన సర్కారు మార్గదర్శకులు దొరకకుంటే సచివాలయ ఉద్యోగులే పేదలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి తెచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా గుర్తించిన బంగారు కుటుంబాలకు ఎలాంటి సాయం కావాలో నిర్ధారించే కార్యక్రమం చేపట్టింది. ఈ సర్వేను శుక్ర, శని, ఆదివారాల్లోనే పూర్తిచేయాలని,, లేకుంటే ఉద్యోగాలు పీకేస్తామంటూ జిల్లా అధికారులు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నామని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.