
ఆత్మగౌరవ పోరాటానికి ఉద్యుక్తం
వలంటీర్ల బాధ్యతలు తమకు అప్పగించడంపై ఆందోళన
కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు
వాట్సాప్ సేవలపై ఇంటింటి ప్రచారాన్నిబహిష్కరించాలని నిర్ణయం
నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు
సాక్షి, అమరావతి/ భీమవరం (ప్రకాశం చౌక్): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు పోరుబావుటా ఎగరవేశారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను అధికారంలోకి రాగానే రద్దు చేసిన కూటమి ప్రభుత్వం... తాజాగా వలంటీర్ల బాధ్యతలను గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అంటగట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పట్లో ఉన్న వలంటీర్ల క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు కేటాయించాలని జిల్లాలకు సమాచారమిచ్చింది. గతంలో 50 ఇళ్లకు ఓ వలంటీర్‌ను నియమించి క్లస్టర్లుగా విభజించగా, ఇప్పుడు నాలుగైదు క్లస్టర్లను ఓ సచివాలయ ఉద్యోగికి కేటాయించి సమాచార సేకరణ, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది.
ఇందుకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆన్‌లైన్ లింకును ఏర్పాటు చేయడంతోపాటు వలంటీర్ల క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు ఎలా మ్యాపింగ్ చేయాలో తెలిపే ఛార్ట్ ఫ్లోనూ శుక్రవారం సాయంత్రమే అన్ని సచివాలయాలకూ చేరవేసింది. దీనిపై సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కూటమి సర్కారు తీరు తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆందోళనే శరణ్యమని పోరుబావుటా ఎగరవేశారు.
జూమ్ మీట్‌లో ఉద్యమానికి సిద్ధం
సర్కారు తీరుపై శుక్రవారం రాత్రి అత్యవసరంగా జూమ్ యాప్‌లో వర్చువల్‌గా సమావేశమైన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు జేఏసీగా ఏర్పడి ఉద్యమం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. వాట్సాప్ సేవలపై శనివారం ఇంటింటి ప్రచారం చేయాలని, ర్యాలీలు చేపట్టాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బహిష్కరించాలని తీర్మానించారు.
ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని సచివాలయ ఉద్యోగులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. పలుచోట్ల సమస్యలపై ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు. భీమవరంలో 40 వార్డుల సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.