
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై కక్షసాధింపు
వెంకటరామిరెడ్డిని పక్కనపెట్టి మిగతా వారికి పదోన్నతులు
హైకోర్టు తీర్పు ఇచ్చిన నాలుగునెలల తరువాత ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల్లో చంద్రబాబు కూటమి సర్కారు వక్రబుద్ధిని ప్రదర్శించింది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డిపై కక్షసాధింపు చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా వెంకటరామిరెడ్డిని పక్కనపెట్టి మిగతా వారికి పదోన్నతులు కల్పించింది. అదీ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చిన నాలుగు నెలలు తరువాత. వివరాల్లోకి వెళ్తే..రాష్ట్ర సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు చాలా ఆలస్యమవుతున్నాయని గ్రహించి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయంలో సాధారణ పరిపాలనశాఖ పరిధిలో వివిధ హోదాల్లో 85 అదనపు పోస్టులు సృష్టించింది.
ఈ అదనపు పోస్టుల వల్ల 2023 సంక్రాంతి రోజు ఒకేసారి 192 మంది సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు తీసుకున్నారు. అందులో 50 మంది విభాగాధికారులు (సెక్షన్ ఆఫీసర్లు) సహాయ కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. సహాయ కార్యదర్శి పదోన్నతి పొందినవారిలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి కూడా ఉన్నారు. ఈ సహాయ కార్యదర్శుల పదోన్నతులపై కొందరు హైకోర్టులో ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు వేయడంతో.. ప్రభుత్వం ఆ పదోన్నతుల ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.
తర్వాత కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు పదోన్నతులు ఇచ్చుకోవచ్చని ఈ ఏడాది జూన్ 5వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు పదోన్నతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చి నాలుగునెలలు అవుతున్నా పదోన్నతులు ఇస్తే వెంకటరామిరెడ్డికి కూడా ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ఎవరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తనను పక్కన పెట్టి మిగతా ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని, తనకోసం మిగతా ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని వెంకటరామిరెడ్డి లేఖ ఇచ్చాక.. వెంకటరామిరెడ్డిని పక్కనపెట్టి మిగతావారికి పదోన్నతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
సహాయ కార్యదర్శుల పదోన్నతులు ఇచ్చే తేదీ నాటికి అంటే 2023 జనవరి 13వ తేదీ నాటికి వెంకటరామిరెడ్డిపై కేసులు లేవు. నిబంధనల మేరకు.. 2024 ఎన్నికల సమయంలో పెట్టిన కేసులు 2023 నుంచే ఇచ్చే ప్రమోషన్లకు అడ్డంకి కాదు. కానీ ప్రభుత్వం కేవలం కక్షసాధింపు కోసమే పదోన్నతి ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఒక ఉద్యోగిపై ఇంతలా కక్షసాధించడం గతంలో ఎప్పుడూ చూడలేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు.
కె.వెంకటరామిరెడ్డి సస్పెన్షన్‌లో ఉన్నారని, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్నారని, ఆయనకు మినహా మిగతా 49 మందికి ప్రభుత్వ సహాయ కార్యదర్శులుగా పదోన్నతులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. క్రమశిక్షణ చర్యలు ముగిసిన తరువాత ఆయన కేసును విడిగా పరిశీలిస్తారని పేర్కొన్నారు.