
ఇష్టానుసారం మ్యాపింగ్.. వలంటీర్ల విధులు అప్పగించడంపై ఆందోళన
సమస్యలను పరిష్కరించకుండా ఒత్తిడి పెంచడం సరికాదని ఆగ్రహం
వచ్చే నెల నుంచి పెన్షన్ పంపిణీ.. ఇతర సేవలు నిలిపి వేయాలని నిర్ణయం
విజయనగరంలో ఈ నెల 13న మహాసభ ద్వారా ఉద్యమానికి శ్రీకారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులనేది పేరుకేగానీ వలంటీర్ల పనులు సైతం మీరే చేయాలంటూ కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై అదనపు భారం మోపుతోంది. దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి అనేక వేధింపులను భరిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చివరికి తమ ఆత్మగౌరవాన్ని సైతం వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో విధిలేక తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఇంటింటికీ వెళ్లి వాట్సప్ సేవల గురించి ప్రచారం చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే నిరవధిక సమ్మెకు సైతం సిద్ధమని ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో శనివారం ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలను తిప్పి కొట్టేందుకు తొలి అడుగు వేయనున్నారు. ఒకప్పుడు ఏ చిన్న పని జరగాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి ఉండేది. అయినా పని జరుగుతుందనే నమ్మకం ఉండేది కాదు. లంచాలు ఇస్తే తప్ప జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందేవి కావు. ఇలాంటి పరిస్థితి నుంచి ఇంటి వద్దకే అన్ని సేవలు అందేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది.
నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో గ్రామ, వార్డు స్థాయిలోనే ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు అందేలా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు నిర్మించారు. వాటిలో లక్షకు పైగా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. సచివాలయాలకు అనుబంధంగా గ్రామ, వార్డు వలంటీర్లను అందుబాటులోకి తెచ్చారు. వారి ద్వారా ప్రతి పథకం అర్హుల ఇంటి వద్దకే చేరేలా చర్యలు తీసుకున్నారు.
వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన కూటమి ప్రభుత్వం
వలంటీర్ల జీతాలను రెట్టింపు చేస్తామని ఎన్నికల ముందు నమ్మించి, అధికారంలోకి రాగానే వారిని ఏకంగా విధుల నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచింది. మరోవైపు సచివాలయ ఉద్యోగులపై అనేక రకాలుగా పని ఒత్తిడి పెంచి, వేధింపులు మొదలు పెట్టింది. కొందరికి నిర్దిష్ట విధులు కేటాయించకుండా నేటికీ ఇష్టానుసారం పని చేయించుకుంటుండటం ఇందుకు నిదర్శనం.
ఇప్పుడు గ్రామ, వార్డులను క్లస్టర్లుగా విడగొట్టి, వాటిలోని కొన్ని ఇళ్లను సచివాలయాల ఉద్యోగులకు (బంగారు కుటుంబాల కోసం) కేటాయించారు. ఈ మ్యాపింగ్ ఉద్యోగుల ప్రమేయం లేకుండా అధికారులే వారికి తోచినట్లు ఇష్టానుసారం చేశారు. దీంతో సచివాలయాల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం విజయనగరంలో మహాసభ నిర్వహించి, తమ వాణి చాటడానికి సిద్ధమయ్యారు.
మహాసభకు ఉద్యోగులంతా తరలి రండి
మా కనీస సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ఇష్టానుసారం వాడుకుంటోంది. రెండు నోషనల్ ఇంక్రిమెంట్ల గురించి పట్టించుకోవడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల గొడుగు కింద ఉన్న అన్ని డిపార్ట్‌మెంట్ల ఉద్యోగులకు ఒకే బేసిక్‌పేతో ప్రమోషన్స్ ఇస్తూ పీఆర్‌సీ స్లాబ్ వర్తింపజేయాలి. శాఖల వారీగా సచివాలయ ఉద్యోగులను మాతృ శాఖలో విలీనం చేయాలి. వలంటీర్ విధులను సచివాలయం ఉద్యోగులకు అప్పగించకూడదు.
ఈ నెలాఖరులోగా ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై చర్చలు జరిపి న్యాయం చేయకపోతే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ పంపిణీతో పాటు ఇతర సేవలు, సర్వేలు నిలిపివేస్తాం. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల మొట్టమొదటి మహాసభ ఉత్తరాంధ్ర వేదికగా ఈ నెల 13వ తేదీన విజయనగరంలోని పీవీజీ రాజు పంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తున్నాం. – బి.మధుబాబు, ఏపీజీడబ్ల్యూఎస్‌ఈ జేఏసీ చైర్మన్