
యువతలో పెళ్లిపై మారుతున్న దృక్కోణం
చదువు, కెరీర్, ఆర్థిక స్థిరత్వానికి తొలి ప్రాధాన్యత
ఆ లక్ష్యాలను సాధించాకే పెళ్లి ఆలోచన
కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయిల కరువు
సామాజిక అంతరాలు, కెరీర్ ప్రాధాన్యతలే కారణం
‘బెటర్ హాఫ్ ఏఐ’ సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: పెళ్లి విషయంలో దేశంలోని యువత ధోరణి మారుతోంది. యుక్త వయస్సు రాగానే పెళ్లి కోసం ఆరాటపడే యువకులు ఇప్పుడు కనిపించడంలేదు. ఒకప్పుడు 23 నుంచి 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం సహజంగా ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకునేందుకు యువత ఆసక్తి చూపడంలేదు. ముఖ్యంగా యువకుల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ మార్పుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి.
ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్వావలంబన, వ్యక్తిగత అభిరుచి మేరకు పెళ్లికి సిద్ధమవుతున్నారు. ‘బెటర్ హాఫ్ ఏఐ’ అనే సంస్థ 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువతపై చేసిన సర్వేలో సుమారు 68శాతం మంది యువకులు ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోకూడదనే అభిప్రాయంతో ఉన్నట్లు తేలింది. ఆ కారణంతోనే పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారని స్పష్టమైంది.
అమ్మాయిలు దొరకడం లేదు
చాలా ప్రాంతాల్లో యువకులకు జోడీగా అమ్మాయిలు దొరకని పరిస్థితి నెలకొంది. చదువుకున్న అమ్మాయిల్లో 65 శాతం మంది తమకు సమానంగా ఉన్న అబ్బాయిలను మాత్రమే పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తున్నారు. చదువు, ఉద్యోగంలో కొంచెం వెనుకబడ్డ యువకులకు పెళ్లి సంబంధాలు రావడం లేదని విజయవాడకు చెందిన ఒక మ్యారేజీ బ్యూరో ప్రతినిధి భవానీ శంకర్ చెప్పారు. ప్రధానంగా కొన్ని సామాజికవర్గాలు, కులవృత్తిపై ఆధారపడివారిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది.
ఐటీ రంగంలో ఉన్నవాళ్లు అదేరంగంలో ఉన్న వారి కోసమే చూస్తున్నారు. అందులోనూ తమ ఉద్యోగ స్థాయికి తగ్గట్టు ఉన్నారో... లేదో.. చూస్తుండడంతో సంబంధాలు వెంటనే కుదరడంలేదు. ఇలా వివిధ అభిరుచులు, కారణాల వల్ల అన్నిచోట్లా తల్లిదండ్రులు సంబంధాల కోసం పరితపించే పరిస్థితి ఏర్పడింది.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే పని చేయని వారికి సంబంధాలే రావడంలేదని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మ్యారేజీ బ్యూరో నిర్వాహకుడు రామారావు చెప్పారు. తమకు సరిపోయే జోడీ దొరక్కపోవడంతో పెళ్లిని చాలామంది వాయిదా వేసుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో అయితే పెళ్లి కంటే సహజీవనం పట్ల ఆకర్షణ కూడా పెరుగుతోంది.
తల్లిదండ్రులపై భారం లేకుండా...
» ‘బెటర్ హాఫ్ ఏఐ’ సర్వే ప్రకారం 70 శాతం మంది యువకులు పెళ్లి ఖర్చును తామే భరించాలనుకుంటున్నారు. తల్లిదండ్రులపై భారం మోపకుండా జీవితం ప్రారంభించాలని ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
» జీవితంలో ఇంకా స్థిరపడలేదు... స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే భావన అబ్బాయిల్లో బలంగా ఉంటోంది.
»గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండటంతో యువకులు కాస్త త్వరగా పెళ్లికి ఒప్పుకుంటున్నారు. అయితే, వారికి సరైన జోడీ దొరకడం కష్టంగా మారుతోంది. ూ చదువు, కెరీర్‌లో ఎదగాలన్న లక్ష్యం కూడా పెళ్లిని రెండవ ప్రాధాన్యతగా మార్చుతోంది.
» పట్టణాల్లో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆర్థిక స్వావలంబన, కెరీర్‌పై ఫోకస్, సరైన భాగస్వామిని ఎంచుకోవాలన్న కారణాల వల్ల పెళ్లి ఆలస్యమవుతోంది.