నిర్భయ: ‘వారి పట్ల మానవ కనికరం అవసరం’ | Sakshi
Sakshi News home page

నిర్భయ కేసు: ‘వారి పట్ల మానవ కనికరం అవసరం’

Published Mon, Mar 2 2020 4:32 PM

Supreme Court Rejects Petition On Nirbhaya Convicts Organ Donation - Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు రేపు (మంగళవారం) ఉరి శిక్ష విధించనున్న నేపథ్యంలో దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్భయ దోషుల అవయవాలను దానం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. ఓ వ్యక్తి చనిపోవడం వ‌ల్ల‌.. ఆ కుటుంబానికి తీర‌ని శోకం మిగులుతుందని, అవ‌య‌వ దానం కోసం దోషుల‌ మృతదేహాలను ముక్కలు చేయ‌డం స‌రికాదని చెప్పింది. వారి ప‌ట్ల మాన‌వ క‌నిక‌రం క‌లిగి ఉండాల‌ని పేర్కొంది. అవ‌యవ దానం అనేది స్వచ్ఛందంగా జ‌ర‌గాల‌ని సుప్రీంకోర్టు త‌న తీర్పులో అభిప్రాయ‌ప‌డింది.
(చదవండి: క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి)

ఉరిశిక్ష ఎదుర్కోనున్న న‌లుగురు దోషుల‌ అవ‌య‌వాలు దానం చేసే వీలు క‌ల్పించాల‌ని మాజీ న్యాయ‌మూర్తి ఎంఎఫ్ స‌ల్దానా తన పిటిష‌న్‌లో కోరారు. ఇకపై మరణ శిక్షకు గురైన వారి అవయవాలను సైతం దానం చేసే దిశగా మార్గదర్శకాలు జారీ చేయాలని సల్దానా పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్‌గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం సుప్రీం కోర్టు నేడు కొట్టివేసింది. ఇక పవన్‌ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొన్ని గంటల వ్యవధిలోనే తిరస్కరించారు. అలాగే  డెత్‌వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు కూడా నిరాకరించింది. దీంతో నలుగురు దోషులను రేపు (మంగళవారం) ఉదయం ఆరుగంటలకు తీహార్‌ జైల్లో ఉరితీయానున్నారు. దీని కొరకు జైలు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.

Advertisement
Advertisement