జస్టిస్‌ జోసెఫ్‌ పేరు మళ్లీ కేంద్రానికి!

Supreme Court Collegium To Reiterate Justice KM Joseph - Sakshi

సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి మరోసారి సిఫారసు

మరికొందరి పేర్లతో కలిపి పంపనున్న కొలీజియం  

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేలా కేంద్రానికి మరోసారి సిఫారసు చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఏకగ్రీవంగా అంగీకరించింది. ప్రస్తుతం వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా ఉన్న వారినీ సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించేందుకు సిఫారసు చేయాలనీ, వారి పేర్లతోపాటే జస్టిస్‌ జోసెఫ్‌ పేరును  కేంద్రానికి పంపాలని కొలీజియం శుక్రవారం తీర్మానించింది. ఏపీæ–తెలంగాణ ఉమ్మడి హైకోర్టు, రాజస్తాన్, కలకత్తా హైకోర్టుల న్యాయమూర్తుల పేర్లూ సిఫార్సుచేయొచ్చని సమాచారం. ఎవరి పేర్లను సిఫార్సు చేయాలనే దానిపై నిర్ణయించేందుకు సీజేఐ జస్టిస్‌ మిశ్రా, జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ మదన్‌ లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ల కొలీజియం మే 16న సాయంత్రం భేటీ కానుంది.

ఇదీ నేపథ్యం..
2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని జస్టిస్‌ జోసెఫ్‌ నేతృత్వంలోని ఉత్తరాఖండ్‌ హైకోర్టు కొట్టేసింది. తర్వాత జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ను సుప్రీం జడ్జిగా నియమించాలని కొలీజియం ఈ ఏడాది జనవరిలో సిఫారసు చేయగా, కేంద్రం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. సిఫార్సు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం అప్పట్లో సుప్రీం జడ్జీలను కోరింది. సుప్రీంకోర్టు జడ్జిగా ఉండటానికి అవసరమైన ప్రమాణాలు, అనుభవం జస్టిస్‌ జోసెఫ్‌కు లేవనీ కొలీజియం సిఫారసును కేంద్రం తిరస్కరించింది. 

తర్వాత జస్టిస్‌ జోసెఫ్‌ విషయంపై చర్చించేందుకు కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జస్టిస్‌ చలమేశ్వర్‌ సీజేఐకి మే 9న లేఖ రాయగా కొలీజియం శుక్రవారం భేటీ అయ్యి పై నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ జోసెఫ్‌ పేరును తిరస్కరిస్తూ న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ లేవనెత్తిన అన్ని అంశాలతో జస్టిస్‌ చలమేశ్వర్‌ విభేదించారు. కొలీజియం సిఫారసులను కేంద్రం ఒకసారి తిరస్కరించాక రెండోసారి కూడా కొలీజియం అదే న్యాయమూర్తి పేరునే సిఫారసు చేస్తే మరోసారి తిరస్కరించే అవకాశం కేంద్రానికి లేదు. కొలీజియం సిఫారసులను ఆమోదించి ఆ వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాల్సిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top