ఇల్లు గడిచేదెట్టా..!

Study Says Indian Homes Dropped Income in Lockdown - Sakshi

ఇక నెట్టుకురాలేమంటున్న అల్పాదాయ వర్గాలు

సాక్షి, న్యూఢిల్లీ :  కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో గత నెలలో దాదాపు 84 శాతం భారతీయ కుటుంబాల రాబడి గణనీయంగా పడిపోయిందని, ప్రభుత్వ ఊతం లేకుండా వీరిలో చాలా మంది ఎక్కువ కాలం మనుగడ సాగించలేరని తాజా అథ్యయనం వెల్లడించింది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ పీవీటీ (సీఎంఐఈ) ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లోని 5800 కుటుంబాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి చికాగో బూత్స్‌ రుస్టాండీ సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సెక్టార్‌ ఇన్నోవేషన్‌ ఈ వివరాలు వెల్లడించింది.

సుదీర్ఘ లాక్‌డౌన్‌తో గ్రామీణ భారతం బారీగా దెబ్బతిన్నదని పరిశోధకులు పేర్కొన్నారు.  లాక్‌డౌన్‌ తీవ్రతతో త్రిపుర, చత్తీస్‌గఢ్‌, బిహార్‌, జార్ఖండ్‌, హరియాణా రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని తెలిపారు. సర్వే పలకరించిన వారిలో 34 శాతం మంది తమకు అదనపు సాయం అందకుంటే మరో వారానికి మించి మనుగడ సాగించలేమని తెలపడం ఆందోళనకరమని అథ్యయనం పేర్కొంది. అల్పాదాయ వర్గాలు లాక్‌డౌన్‌తో అధికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా మార్చి 25న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించిన తర్వాత 10 కోట్ల మంది భారతీయులు ఉద్యోగాలను కోల్పోయారని సీఎంఐఈ సహా ఇతర అథ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

చదవండి : ఎంజాయ్‌ చేసేందుకు ఇక్కడకు రావొద్దు: సీఎం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top