భారత్‌లో ప్రజాస్వామ్యం పతనం

A Study Quantifies The Sharp Retreat of Indian Democracy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత దేశంలో ప్రజాస్వామ్య ప్రమాణాలు దారుణంగా పడిపోతూ వచ్చాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. భారత్‌ ఉదార ప్రజాస్వామ్య సూచికలో 2010 నుంచి అతి స్వల్ప పతనం కనిపించగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి భారీ పతనం ప్రారంభమైందని అధ్యయన నివేదిక పేర్కొంది. ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య సూచికలో ప్రస్తుతం భారత స్థానం 81 అని నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో శ్రీలంక, నేపాల్‌కన్నా వెనకబడి పోవడం గమనార్హం.

స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ యూనివర్శిటీ పొలిటికల్‌ విభాగానికి చెందిన 2,500 మంది నిపుణుల బృందం ఈ అధ్యయనాన్ని జరిపింది. స్వేచ్చా, స్వతంత్య్ర పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిగాయా లేదా?, ప్రభుత్వ సంస్థలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి సమతౌల్యంగా పనిచేస్తున్నాయా, లేదా?, వ్యక్తిగత మానవ హక్కులు, సంస్థాగత హక్కులు ఎలా అమలు జరుగుతున్నాయి? రెండింటి మధ్య సమతౌల్యత ఉందా, లేదా? అన్న పలు అంశాల ప్రాతిపదికన ఈ అధ్యయనం చేశారు. భారత దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలోనే జరిగాయని అధ్యయనం అభిప్రాయపడింది. మోదీ ప్రభుత్వం కాస్త అధికార కేంద్రీకృత ధోరణిలో పనిచేస్తోందని అధ్యయనం పేర్కొంది.

మోదీ హయాంలో ప్రధానంగా మీడియాపై అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయి. దేశంలో భావ ప్రకటన స్వాతంత్య్రం కూడా 2014 నుంచి 27 శాతం పడిపోయిందని అధ్యయనం తెలిపింది. అలాగే పౌర సంస్థల సామాజిక కార్యక్రమాలు బాగా స్తంభించిపోయాయని, దేశంలో ప్రధానంగా మానవ హక్కుల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న దాదాపు 20 వేల సంస్థల (ఎన్జీవోలు) లైసెన్స్‌లను ఎఫ్‌సీఆర్‌ఏ (ఫారిన్‌ కంట్రీబ్యూషన్స్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌) కింద మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం 13 వేల సంస్థలు మాత్రమే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఫలితంగా దేశ ప్రజాస్వామ వ్యవస్థలో సామాజిక సంస్థల పాత్ర పతనమైందని పేర్కొంది.

1975–77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఇప్పటికీ దేశంలో రాలేదని, ప్రజాస్వామ్య ప్రమాణాలు మరింతగా పడిపోతుంటే ఆనాటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అధ్యయన బృందం వ్యాఖ్యానించింది. ఒక్క భారత్‌లోనే కాకుండా బ్రెజిల్, రష్యా, టర్కీ, అమెరికా దేశంల్లో కూడా ప్రజాస్వామ్య ప్రమాణాలు పడిపోయాయని అధ్యయనం తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top