breaking news
sweden study
-
భారత్‌లో ప్రజాస్వామ్యం పతనం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత దేశంలో ప్రజాస్వామ్య ప్రమాణాలు దారుణంగా పడిపోతూ వచ్చాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. భారత్ ఉదార ప్రజాస్వామ్య సూచికలో 2010 నుంచి అతి స్వల్ప పతనం కనిపించగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి భారీ పతనం ప్రారంభమైందని అధ్యయన నివేదిక పేర్కొంది. ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య సూచికలో ప్రస్తుతం భారత స్థానం 81 అని నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో శ్రీలంక, నేపాల్‌కన్నా వెనకబడి పోవడం గమనార్హం. స్వీడన్‌లోని గోథెన్బర్గ్ యూనివర్శిటీ పొలిటికల్ విభాగానికి చెందిన 2,500 మంది నిపుణుల బృందం ఈ అధ్యయనాన్ని జరిపింది. స్వేచ్చా, స్వతంత్య్ర పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిగాయా లేదా?, ప్రభుత్వ సంస్థలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి సమతౌల్యంగా పనిచేస్తున్నాయా, లేదా?, వ్యక్తిగత మానవ హక్కులు, సంస్థాగత హక్కులు ఎలా అమలు జరుగుతున్నాయి? రెండింటి మధ్య సమతౌల్యత ఉందా, లేదా? అన్న పలు అంశాల ప్రాతిపదికన ఈ అధ్యయనం చేశారు. భారత దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలోనే జరిగాయని అధ్యయనం అభిప్రాయపడింది. మోదీ ప్రభుత్వం కాస్త అధికార కేంద్రీకృత ధోరణిలో పనిచేస్తోందని అధ్యయనం పేర్కొంది. మోదీ హయాంలో ప్రధానంగా మీడియాపై అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయి. దేశంలో భావ ప్రకటన స్వాతంత్య్రం కూడా 2014 నుంచి 27 శాతం పడిపోయిందని అధ్యయనం తెలిపింది. అలాగే పౌర సంస్థల సామాజిక కార్యక్రమాలు బాగా స్తంభించిపోయాయని, దేశంలో ప్రధానంగా మానవ హక్కుల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న దాదాపు 20 వేల సంస్థల (ఎన్జీవోలు) లైసెన్స్‌లను ఎఫ్సీఆర్ఏ (ఫారిన్ కంట్రీబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్) కింద మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం 13 వేల సంస్థలు మాత్రమే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఫలితంగా దేశ ప్రజాస్వామ వ్యవస్థలో సామాజిక సంస్థల పాత్ర పతనమైందని పేర్కొంది. 1975–77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఇప్పటికీ దేశంలో రాలేదని, ప్రజాస్వామ్య ప్రమాణాలు మరింతగా పడిపోతుంటే ఆనాటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అధ్యయన బృందం వ్యాఖ్యానించింది. ఒక్క భారత్‌లోనే కాకుండా బ్రెజిల్, రష్యా, టర్కీ, అమెరికా దేశంల్లో కూడా ప్రజాస్వామ్య ప్రమాణాలు పడిపోయాయని అధ్యయనం తెలిపింది. -
రైతు ఆత్మహత్యలపై స్వీడన్ అధ్యయనం
అన్నదాతల ఆత్మహత్యలపై ప్రభుత్వానికి నివేదిక జగదేవ్‌పూర్: మండలంలోని లింగారెడ్డిపల్లిలో నాలుగు నెలల క్రితం రైతు చిక్కుడు వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంపై గురువారం తెలంగాణ రైతు రక్షణ సమితి, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో స్వీడన్ దేశస్థురాలు మయా, లాయిన్ అధ్యయనం చేశారు. సాయంత్రం 4 గంటలకు వారు గ్రామానికి చేరుకుని చిక్కుడు వెంకటేశం భార్య లలిత, ఇద్దరు పిల్లల కుటుంబ పరిస్థితులను ఆడిగి తెలుసుకున్నారు. గంటకు పైగా వెంకటేశం ఆత్మహత్య గల కారణాలను, కుటుంబ ఆర్థిక పరిస్థితులను వారు ఆరా తీశారు. భార్య లలిత మాట్లాడుతూ తమకున్న రెండెకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేసేవారిమని, గత కొన్నేళ్లుగా వర్షభావ పరిస్థితుల వల్ల పంటలు పండకపొవడంతో సాగుకు చేసిన అప్పులు ఎక్కువయ్యాయని వివరించారు. అనంతరం స్వీడన్ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. రెండు రోజుల నుంచి తెలంగాణలో వివిధ జిల్లాలో రైతు ఆత్మహత్య కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేశామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశామని, సమావేశంలో రైతు ఆత్మహత్యలకు కారణాలను వివరిస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిరాజు, రైతు స్వరాజ్య వేధిక రాష్ట్ర నాయకులు కొండల్‌రెడ్డి, చంద్రం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.