ఫెలోషిప్‌ నిరాకరించారని దళిత ప్రొఫెసర్‌పై..

Student Beats Up Dalit Professor In Ambedkar University After Fellowship Declined - Sakshi

లక్నో : ఫెలోషిప్‌ నిరాకరించినందుకు ఓ దళిత ప్రొఫెసర్‌పై ఆయన ఛాంబర్‌లోనే అగ్రవర్ణ విద్యార్థి దాడి చేసిన ఘటన బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీలో కలకలం రేపింది. కులం పేరుతో ప్రొఫెసర్‌ను దూషిస్తూ, ఆయనను తోసివేయడంతో వర్సిటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధిత ప్రొఫెసర్‌ ఫిర్యాదుతో నిందితుడు, రీసెర్చ్‌ స్కాలర్‌ సంజయ్‌ ఉపాధ్యాయను లక్నో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా వర్సిటీ క్యాంపస్‌లో భారీగా పోలీస్‌ బలగాలను తరలించారు. ప్రొఫెసర్‌ను రీసెర్చ్‌ స్కాలర్‌ కులం పేరుతో దూషించడం పట్ల ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు.

ఎకనమిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో సంజయ్‌ ఉపాధ్యాయ ప్రొఫెసర్‌ ఎల్‌సీ మాలియ పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేస్తున్నారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఫెలోషిప్‌ కోసం ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం తిరస్కరణకు గురైందని చెప్పారు. తాను దళితుడిని కాకపోవడం వల్లే తన పేపర్‌ను తిరస్కరించారని ప్రొఫెసర్‌ మాలియతో సంజయ్‌ వాగ్వాదానికి దిగారు. ప్రొపెసర్‌ను కులం పేరుతో దూషిస్తూ కాలర్‌ పట్టుకుని కొట్టేందుకు ప్రయత్నించారు. ఇతర ఫ్యాకల్టీ సభ్యులు ఆయనను కాపాడారని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు ఈ ఘటనలో నిందితుడు, బాధితుడు అగ్ర, నిమ్న వర్గాలకు చెందిన వారు కావడంతో ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్ధులు రెండు వర్గాలుగా విడిపోయారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top