మాజీ సీఎం సిఫారసుతో సినిమాల్లోకి

Sridevi came into the film industry by Ex-CM kamarajar recommendations - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కామరాజర్‌ సిఫార్సుతోనే శ్రీదేవి బాలనటిగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ విషయం ఆమె తండ్రి అయ్యప్పన్‌ సన్నిహిత మిత్రులకు మాత్రమే తెలుసు. వారిలో ఒకరైన 81 ఏళ్ల బాలు నాయకర్‌ శ్రీదేవి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శ్రీదేవి స్వగ్రామంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్, తాను సాత్తూరు కోర్టులో జూనియర్‌ న్యాయవాదులుగా ఉన్న సమయంలో స్నేహితులమయ్యామని చెప్పారు. అయ్యప్పన్‌కు చెన్నై సీఐటీ నగర్‌లో ఓ ఇల్లు కూడా ఉండేదని.. శ్రీదేవి నాలుగేళ్ల వయసులో ఆయన చెన్నైకు వచ్చేశారన్నారు. ఆ ఇంటికి సమీపంలోనే అప్పటి కాంగ్రెస్‌ నేత, దివంగత సీఎం కామరాజర్‌ నివాసం ఉండేదని ఆయన వివరించారు.

కామరాజర్‌కు అయ్యప్పన్‌ సన్నిహితుడని.. ఆ పరిచయం శివకాశి నియోజకవర్గం నుంచి అయ్యప్పన్‌ ఎమ్మెల్యేగా పోటీచేయడానికి దారితీసిందన్నారు. ఆ ఎన్నికల్లో అయ్యప్పన్‌ ఓడిపోయాడని, దాంతో చెన్నైకు పరిమితమైనట్టు ఆయన తెలిపారు. ఓ సాయంత్రం అయ్యప్పన్‌ శ్రీదేవిని వాకింగ్‌కు తీసుకెళ్లిన సమయంలో కామరాజర్‌ చూశారని.. అప్పట్లో చిన్నారి శ్రీదేవి అందం, చురుకుదనం చూసి అక్కడే ఉన్న రచయిత కన్నదాసన్‌ను పిలిచి సినిమాల్లో నటింపజేయడానికి ఏర్పాట్లుచేయాలని సూచించినట్టు నాయకర్‌ తెలిపారు.

అనంతరం కామరాజర్‌ సిఫారసుతో కన్నదాసన్‌.. నిర్మాత సాండో చిన్నప్ప దేవర్‌కు శ్రీదేవి గురించి చెప్పినట్టు ఆయన వివరించారు. అదే సమయంలో బాలనటి కోసం ఎదురుచూస్తున్న దేవర్, తొనైవన్‌ సినిమాలో శ్రీదేవికి అవకాశం కల్పించారన్నారు. దానితో మొదలైన శ్రీదేవి సినీ ప్రస్థానం ముంబై వరకు సాగించిందని ఆయన వివరించారు. శ్రీదేవి శాశ్వతంగా దూరం కావడం వేదన కల్గిస్తోందని నాయకర్‌ చెప్పారు. ప్రస్తుతం మీనంపట్టిలోని పూర్వీకుల నివాసంలో అయ్యప్పన్‌ సోదరుడు రామస్వామి కుటుంబం ఉంటున్నట్టు ఆయన చెప్పారు.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top