
సాక్షి, ముంబై : భారతీయ జనతా పార్టీని తిరిగి అధికారంలోకి రానివ్వొద్దంటూ దేశ ప్రజలకు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ఆమె ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ఈ క్రమంలో బీజేపీ పాలన దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తోందని సోనియా ఆక్షేపించారు.
‘బీజేపీ పాలనలో ప్రజల స్వేచ్ఛ దాడులకు గురవుతోంది. అభివృద్ధి కుంటుపడి దేశం తిరోగమనంలో పయనిస్తోంది. ప్రత్యామ్నాయ గొంతుకలను నొక్కేస్తున్నారు. మత ఘర్షణలు మరింతగా పెరిగిపోయాయి. కేవలం అధికారమే పరమావధిగా అనైతిక రాజకీయాలను ప్రదర్శిస్తున్న బీజేపీ.. స్థానిక రాజకీయాలను దెబ్బతీస్తోంది’ అని సోనియా పేర్కొన్నారు. కనీసం చట్టసభల్లో విపక్షాలు మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయని.. అలాంటప్పుడు పార్లమెంట్‌ను మూసేసి ప్రతినిధులంతా ఇళ్లకు వెళ్లొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. వాజ్ పేయి హయాంలోని పరిస్థితులు.. మోదీ పాలనలో కనీసం కూడా కనిపించటం లేదని ఆమె అన్నారు.
బీజేపీ పాలనపై స్పందిస్తూ... ప్రస్తుతం దేశంలో న్యాయ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆమె చెప్పారు. చట్టాలు కఠినంగా అమలు కావటం లేదు. పారదర్శకత కోసం ఆర్టీఐ యాక్ట్ తీసుకొస్తే.. దానిని కోల్డ్ స్టోరేజీ పెట్టేశారు. ఆధార్ పరిస్థితి కూడా అస్తవ్యస్థంగా తయారయ్యింది అని ఆమె తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రకటనలు తప్ప.. అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందన్న విషయం ఎవరికీ తెలీని గందరగోళం నెలకొందని సోనియా చెప్పారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి మళ్లీ అధికారం కట్టబెట్టొద్దని వేదిక సాక్షిగా ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
చివర్లో 2014 ఎన్నికల్లో ఓటమి కారణాలపై స్పందించిన ఆమె అవినీతి ఆరోపణలు తమను దారుణంగా దెబ్బతీశాయన్నారు. అదే సమయంలో మోదీ చరిష్మా బీజేపీకి కలిసొచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కొత్త తరహా రాజకీయాలకు అలవాటు పడాలన్న విశ్లేషకుల సూచనతో తానూ ఏకీభవిస్తానన్న ఆమె.. రాహుల్ గాంధీ సారథ్యంలో అది సాధ్యమౌతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై స్పందిస్తూ అది పార్టీ అంతర్గత విషయమని సోనియా పేర్కొన్నారు.