ఇది అధికార దుర్వినియోగం కాదా ? | Smriti Irani recommends over 5,000 admissions in Kendriya Vidyalaya schools | Sakshi
Sakshi News home page

ఇది అధికార దుర్వినియోగం కాదా ?

Nov 23 2015 5:51 PM | Updated on Aug 17 2018 3:08 PM

ఇది అధికార దుర్వినియోగం కాదా ? - Sakshi

ఇది అధికార దుర్వినియోగం కాదా ?

దేశంలోని కేంద్రీయ విద్యా సంస్థల్లో ఈ ఏడాది అడ్మిషన్ల కోసం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఏకంగా 5,100 మంది విద్యార్థులను సిఫార్సు చేశారు.

న్యూఢిల్లీ: దేశంలోని కేంద్రీయ విద్యా సంస్థల్లో ఈ ఏడాది అడ్మిషన్ల కోసం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఏకంగా 5,100 మంది విద్యార్థులను సిఫార్సు చేశారు. కేంద్ర మంత్రిగా, కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ చైర్‌పర్సన్‌గా ప్రతి విద్యా సంవత్సరానికి కేవలం 1200 మంది విద్యార్థుల అడ్మిషన్ కోసం మాత్రమే ఆమె సిఫార్సు చేసే వీలుంది. ఏకంగా నాలుగింతలుకన్నా ఎక్కువ మందిని సిఫార్సు చేయడం ఇప్పుడు ట్విట్టర్‌లో చర్చ నీయాంశమైంది.
 

 స్మృతి ఇరానీ చేసిన మొత్తం 5,100 మంది విద్యార్థుల సిఫార్సుల్లో ఇటీవల జరిగిన కేంద్రీయ విశ్వవిద్యాలయ బోర్డు సమావేశంలో 3,000 సిఫార్సులను మాత్రమే అంగీకరించారు. వాటిని మంత్రిగారి సిఫార్సులని కూడా పేర్కొన్నారు. మంత్రి చేసిన సిఫార్సుల్లో కొంత మంది విద్యార్థులు స్వచ్ఛందంగా అడ్మిషన్ల నుంచి తప్పుకోగా మరికొంత మంది విద్యార్థుల అడ్మిషన్లను వివిధ కారణాల వల్ల బోర్డు తిరస్కరించినట్టు తెలుస్తోంది. మంత్రిగారి మిగతా సిఫార్సులను ఎందుకు తిరస్కరించారన్న అంశంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దర్యాప్తు జరుపుతున్నట్టు కూడా  తెలిసింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా 1500 మంది విద్యార్థులకు మించి సిఫార్సు చేయలేదు.
 

 దేశంలో అవినీతి అక్రమాలను సమూలంగా నిర్మూలిస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెబుతున్న సందర్భంలో ఆయన కేబినెట్ మంత్రి ఇంతమంది విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా సిఫార్సు చేయడం ఏమిటని ట్విట్టర్‌లో ప్రశ్నిస్తున్నారు.  విద్య అందని పండైన నిమ్న, వెనుకబడిన వర్గాల విద్యార్థులనే తాను ఎక్కువగా సిఫార్సు చేశానని, వాటిలో పార్టీలతో ప్రమేయం లేకుండా తనను ఆశ్రయించిన కొంత మంది ఎంపీల సిఫార్సులు కూడా ఉన్నాయని, జ్యోతిరాదిత్య సింధియా లాంటి కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారంటూ స్మృతి ఇరానీ ట్విట్టర్‌లో సమర్థించుకున్నారు. పైగా మీడియాలో ఈ విషయమై వచ్చిన వార్తా కథనంలో రెండు వ్యాక్యాలే నిజమని, మిగతాదంతా వారి ఎజెండా ప్రకారం రాసుకున్నారని ఆరోపించారు. ఎంపీలు సిఫార్సు చేయమంటే మాత్రం నిబంధనలకు నీళ్లొదులుతారా ? అంటూ కొంత మంది నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇప్పటికే ఏడాదికి ఆరుగురు విద్యార్థుల అడ్మిషన్లకు సిఫార్సు చేసే అవకాశం ప్రతి ఎంపీకి ఉంది. ఈ కోటాను వచ్చే ఏడాది నుంచి పదికి పెంచుతూ ఇటీవలనే కేంద్రీయ విద్యాలయ బోర్డు నిర్ణయం తీసుకొంది. దీంతో ఎంపీల కోటా 7,900కు పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement