
ఆ దేశానికి మా విమానాలు పంపబోం!
షియా మతగురువు ఉరితీతపై సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య విభేదాలు రోజురోజుకి తీవ్రరూపం దాలుస్తున్నాయి.
రియాద్: షియా మతగురువు ఉరితీతపై సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య విభేదాలు రోజురోజుకి తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇరాన్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న సౌదీ తాజాగా ఆ దేశంతో తమ వైమానిక అనుబంధాన్ని తెంపుకుంటున్నట్టు ప్రకటించింది. ఇక ఇరాన్ తో తమ దేశం నుంచి విమాన రాకపోకలు ఉండబోవని స్పష్టం చేసింది. అదేవిధంగా ఇరాన్తో ఉన్న వాణిజ్య సంబంధాలన్నింటినీ తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. తమతో మళ్లీ దౌత్య సంబంధాలు పెంపొందించుకోవాలంటే ముందు ఇరాన్ ఓ సాధారణ దేశంలా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికింది.
సున్నీ ప్రాబల్య దేశమైన సౌదీ షియా మత గురువు నిమ్ర్ అల్ నిమ్ర్ ను ఉరితీయడం.. దీనిని షియా మెజారిటీ దేశమైన ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇరుదేశాల మధ్య వైరం రాజుకున్న సంగతి తెలిసిందే. నిమ్ర్ ఉరితీసిన అనంతరం యూనైటెడ్ కింగ్డమ్లో భాగమైన సౌదీలో ఉద్రిక్తతలు పెంచేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నదని, కింగ్డమ్లో, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లో దాడులు చేసేందుకు ఇరాన్ తన ఫైటర్లను పంపుతున్నదని, దీనిని తాము దీటుగా ఎదుర్కొంటామని సౌదీ విదేశాంగ మంత్రి అదెల్ అల్ జుబీర్ మంగళవారం తెలిపారు. ఇరాన్ కుయుక్తులను ఎదుర్కొనేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.