యథేచ్ఛగా ఇసుక రవాణా  

Sand mafia  - Sakshi

పెద్దఎత్తున గూడ్స్‌లో తరలిస్తున్న వైనం

పట్టించుకోని అధికారులు

ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిసర ప్రాంత ప్రజలు

రాయగడ : జిల్లాలోని కల్యాణసింగుపురం పట్టణ పరిధిలోని లెల్లిగుమ్మ రైల్వేస్టేషన్‌ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు వస్తున్న వార్తలు ప్రసుతం జిల్లాలో సంచలనం రేపుతున్నాయి. కోట్లాది రూపాయాలు విలువ చేసే ఇసుకను అనేక బస్తాలలో నింపి, గూడ్స్‌ రైలులో తరలిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది రైల్వే అధికారుల అండతోనే దుండగులు ఇసుకమాఫియాకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో పాటు రాజకీయ నేతల అండదండలు కూడా తోడవ్వడంతో అక్రమదారుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. 

కల్యాణసింగుపురం పరధిలోని నాగావళి నది, ఇతర చిన్న నదుల నుంచి పొక్లెయిన్‌ల సహాయంతో పెద్ద ఎత్తున ఇసుకను అక్రమదారులు తరలించడం విశేషం. స్థానిక తహసీల్దార్‌ అనుమతి లేకుండా ఇసుక తరలించడం చట్ట రీత్యా నేరమని తెలిసినా అక్రమదారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే విషయమై జిల్లా అధికారులకు, స్థానిక తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో రెండు సార్లు కల్యాణసింగుపురం తహసీల్దార్‌  అక్రమార్కులపై దాడులు చేసి, వేల సంఖ్యలో ఇసుక బస్తాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో దోపిడీదారులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.

నాగావళి నది నుంచి భారీ స్థాయిలో ఇసుకను తరలించడంతో నాగావళి నది వరదలకు గురవుతోందని నదీ పరిసర ప్రాంత ప్రజలు వాపోతున్నారు. దీంతో కల్యాణసింగుపురం పట్టణంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులు ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top