
జైపూర్ : ఆ వివాహ వేడుకలో అనుకోకుండా జరిగిన ఘటన పెను విషాదం మిగిల్చింది. వేడుక జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలి ఆరుగురు చనిపోగా 15మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా ఖటోలాయి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో పెళ్లి జరుగుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ అకస్మాత్తుగా పేలింది. దీంతో పెళ్లికి వచ్చిన వారిలో ఆరుగురు చనిపోగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను వెంటనే జైపూర్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వసుంధరా రాజే తీవ్ర సంతాపం ప్రకటించారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.