2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 14 లక్షల కొత్త ఈవీఎంలను కొనాలన్న ఎన్నికల కమిషన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర కేబినెట్ మంజూరు
న్యూఢిల్లీ : 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 14 లక్షల కొత్త ఈవీఎంలను కొనాలన్న ఎన్నికల కమిషన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశమై పలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. 2016-17లో మొదటి విడతలో 5.5 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 5.45 లక్షల కంట్రోల్ యూనిట్లను కొనేందుకు రూ. 920 కోట్లను మంజూరుచేసింది. ఒక్కో ఈవీఎంకు బ్యాలెట్‌యూనిట్, కంట్రోల్ యూనిట్ ఉంటాయి.
వీటిని బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) తయారుచేస్తాయి. కాగా ట్రాన్స్‌జెండర్ల (హక్కుల పరిరక్షణ) బిల్లును ప్రవేశపెట్టేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఓడరేవులను అభివృద్ధి పరచేందుకు ‘సాగరమాల అభివృద్ధి కంపెనీ’ని కంపెనీ చట్టం కింద ఏర్పాటుచేయడానికి, గోరఖ్‌పూర్(యూపీ)లో రూ.1,011 కోట్లతో ఎయిమ్స్‌ను నిర్మించాలన్న ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. బినామీ లావాదేవీలను కట్టుదిట్టంగా నిరోధించేందుకు ఉద్దేశించిన బినామీ లావాదేవీల సవరణ బిల్లు-2015లో కొన్ని సవరణలను ఆమోదించింది.