మమల్ని శరణార్థులుగా భావించండి : రోహింగ్యాలు

Rohingya Refugees file an affidavit in Indian Supreme Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రోహింగ్యాలు శరణార్థులు కారని.. ముమ్మాటికీ అక్రమ వలసదారులేనని భారత ప్రభుత్వం నేపథ్యంలో వాళ్ల భవితవ్యంపై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందా? అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న కేంద్రం ఆరోపణలను రోహింగ్యాలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో రోహింగ్యాల తరపున అఫిడవిట్‌ దాఖలు అయ్యింది.

‘ఉగ్రవాద సంస్థలైన ఐఎస్‌ఐ, ఐసిస్‌లతో రోహింగ్యాలకు ఎలాంటి సంబంధాలు లేవు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్న కేంద్రం అందుకు సరైన సాక్ష్యాలను చూపించలేకపోతుంది’ అంటూ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తమను కూడా టిబెటన్‌, లంక శరణార్థలుగా గుర్తించి.. భారత్‌ లోనే ఆశ్రయం కల్పించాలని రోహింగ్యాలు కోరుతున్నారు. తమను దేశం నుంచి పంపించి వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరారు. శరణార్థులకు, వలసవాదులకు ఉన్న తేడాలను గుర్తించాలని రోహింగ్యాలు కేంద్రానికి సూచించారు. ప్రాణ భయంతో మరో దేశానికి ఆశ్రయించేవారిని శరణార్థులుగా.. ఉపాధి కల్పన వెళ్లేవారిని వలసవాదులుగా పేర్కొంటారన్న విషయాన్ని గుర్తించాలని న్యాయస్థానానికి వారు విజ్ఞప్తి చేశారు.  

40,000 మంది రోహింగ్యాల తరపున ఇప్పటికే సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై వాదనను కోర్టు అక్టోబర్‌ 3కి వాయిదా వేసింది. అయితే అదే రోజు బాలల హక్కుల ప్యానెల్‌కు సంబంధించి ఓ పిటిషన్‌పై వాదనలు ఉండటంతో రోహింగ్యాల అంశం చర్చకు వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఇప్పటివరకు రోహింగ్యాలు ఎవరూ శరణార్థులుగా ఉండేందుకు దరఖాస్తు చేసుకోలేదు అని, అందుకే వాళ్లను వెనక్కి పంపనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. అక్రమ వలసదారులుగా పేర్కొంటూ రోహింగ్యాలతో జాతీయ భద్రతకు ముప్పు అంటూ కేంద్రం కూడా అఫిడవిట్‌దాఖలు చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top