ఆశ్చర్యం కలిగిస్తున్న పూణె రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జీవన శైలి

Retired Pune Professor Has Lived Her Whole Life Without Electricity - Sakshi

ముంబై : నేటి కాలంలో రోజంతా కాదు కదా కనీసం ఓ అరగంట కూడా కరెంట్‌ లేని జీవితాన్ని ఊహించడం చాలా కష్టం. పల్లేల్లో అయితే పర్లేదు.. కానీ నగరవాసికి ఒక్క నిమిషం కరెంట్‌ లేకపోయినా ఊపిరాడదు. కానీ పూణెకు చెందిన ఓ రిటైర్డ్‌ మహిళా ప్రొఫెసర్‌ తన జీవితాంతం కరెంట్‌తో పని లేకుండానే గడిపేస్తున్నారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. వివరాలు.. హేమా సనే(79) అనే బోటనీ ప్రొఫెసర్‌ పూణెలోని బుధ్వార్‌ పేత్‌లోని ఓ చిన్న ఇంటిలో ఏళ్లుగా కరెంట్‌ లేకుండా జీవిస్తున్నారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నా జీవన విధానాన్ని చూసి చాలా మంది నన్ను పిచ్చిదాన్నిగా భావిస్తారు. కానీ నేను వాటిని పట్టించుకోను. ఇలా జీవించడమే నాకు ఇష్టం. ఆహారం, బట్టలు, ఇళ్లు ఇవే మనిషి కనీస అవసరాలు. పూర్వం కరెంట్‌ ఉండేది కాదు. తర్వాత వచ్చింది. కానీ కరెంట్‌ అవసరం లేకుండానే నేను జీవించగల్గుతున్నాను’ అని చెప్పారు.

కొన్ని పక్షులు, ముంగిస, ఓ కుక్క వీటినే తన ఆస్తులుగా చెప్పుకుంటారు హేమా సనే. అంతేకాక ఇవన్ని ప్రకృతి సంపద అని.. తాను వాటిని రక్షిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రతి రోజు తాను ఈ పక్షుల కువకువలతో మేల్కొంటానని.. నక్షత్రాల కాంతిలో రాత్రుళ్లు గడుపుతానని పేర్కొన్నారు. ఈ ఇంటిని అమ్మి వేరే ఇంటికి మారమని సలహా ఇస్తే.. మరి ఈ చెట్లను, పక్షులను ఎవరూ చూస్తారని తిరిగి ప్రశ్నిస్తారు హేమా సనే. కరెంట్‌ లేకుండా మీరు జీవించగల్గుతున్నారని ప్రశ్నించగా.. కరెంట్‌ ఉండి మీరు ఎలా బతుకుతున్నారో.. విద్యుత్‌ లేకుండా నేను కూడా అంతే సౌకర్యంగా జీవిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాక తన జీవన విధానం ద్వారా తాను ఎవరికి ఎలాంటి సందేశం ఇవ్వడం లేదన్నారు. జీవితంలో మీ మార్గాన్ని మీరే కనుగొనండి అని బుద్ధుడు చెప్పిన సందేశాన్నే నేను అవలంభిస్తున్నాను అని హేమా సనే తెలిపారు.

హేమా సనే సావిత్రిబాయి పూలే పూణె యూనీవర్సిటీ నుంచి బోటనీలో పీహెచ్‌డీ చేశారు. అనంతరం పుణెలోని గార్వెర్‌ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా చాలా ఏళ్లు విధులు నిర్వహించారు. బోటనీ మరియు పర్యావరణంపై ఆమె అనేక పుస్తకాలను రచించారు. ఇవన్ని ఇప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నేటికి కూడా ఆమె కొత్త పుస్తకాలను రాయడం కొనసాగిస్తున్నారు. ఆమెకు తెలియని పక్షులు, చెట్లు ఈ పర్యావరణంలో లేవంటే అతియోశక్తి కాదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top