ముంబై సబర్బన్ రైళ్లలో పెరిగిన చార్జీలను తగ్గించే అంశంపై రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ, శివసేన ఎంపీలు వెల్లడించారు.
రైల్వే మంత్రి హామీ ఇచ్చారన్న శివసేన, బీజేపీ ఎంపీలు
న్యూఢిల్లీ: ముంబై సబర్బన్ రైళ్లలో పెరిగిన చార్జీలను తగ్గించే అంశంపై రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ, శివసేన ఎంపీలు వెల్లడించారు. రెండు పార్టీలకు చెందిన 10 మంది ఎంపీలు సోమవారం రైల్వే మంత్రి సదానందను కలిసి ముంబై సబర్బన్ రైళ్లలో పెంచిన చార్జీలను ఉపసంహరించాలని కోరారు. దీనిపై సదానంద నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య తెలిపారు.
తగ్గింపుపై త్వరలో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు. రైల్వే బోర్డు అధికారులతో చర్చించి ఊరట కల్పించే నిర్ణయాన్ని తీసుకుంటామని సదానంద గౌడ హామీ ఇచ్చినట్లు బీజేపీకి చెందిన మరో ఎంపీ కపిల్ పాటిల్ వెల్లడించారు. సబ్ అర్బన్ రైళ్లలో భద్రతను పెంచి ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని కూడా రైల్వే మంత్రి హామీ ఇచ్చినట్లు సోమయ్య తెలిపారు.
చార్జీల మోతను ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారన్న తమ వాదనతో రైల్వే మంత్రి ఏకీభవించినట్లు ఎంపీలు పేర్కొన్నారు. రైలు చార్జీల పెంపు నెలవారీ పాస్‌లు తీసుకునే ముంబైకర్లకు భారంగా మారింది. మహారాష్ట్ర శాసనసభకు ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైలు చార్జీల పెంపును శివసేన, బీజేపీ తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇది కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే బహిరంగంగానే పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించారు.