
రూ.25 వేల కోట్లతో రాందేవ్ బాబా వర్సిటీ!
యోగా గురువు రాందేవ్ బాబా దేశంలో రాకెట్ వేగంతో దూసుకువెళుతున్నారు. యోగా కార్యక్రమ నిర్వహణలో అగ్రభాగాన ఉన్న ఆయన ఇక వాణిజ్య విభాగంలో కూడా దూసుకెళ్లారు.
హ్యూస్టన్: యోగా గురువు రాందేవ్ బాబా దేశంలో రాకెట్ వేగంతో దూసుకువెళుతున్నారు. యోగా కార్యక్రమ నిర్వహణలో అగ్రభాగాన ఉన్న ఆయన ఇక వాణిజ్య విభాగంలో కూడా దూసుకెళ్లారు. ఇక తాజాగా ఆయన విద్యారంగంవైపు దృష్టి సారించారు. వచ్చే ఐదేళ్లలో రాందేవ్ బాబా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని నిర్మించతలపెట్టారు. ఇందుకోసం ఇప్పటికే 1,500 ఎకరాల భూమిని కూడా సిద్ధం చేసి ఉంచారట. దాదాపు లక్షమంది విద్యార్థులకు వివిధ విభాగాల ద్వారా అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా ఆయన ఈ వర్సిటీని స్థాపించనున్నారట.
హ్యూస్టన్లో ఈ నెల 23న నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాందేవ్ త్వరలోనే ఢిల్లీకి అతి సమీపంలో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ తరహాలో వరల్డ్ క్లాస్ వర్సిటీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. దీనికోసం ఆయన రూ.25,000 కోట్లు వెచ్చించనున్నారు. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి విలువలతో విద్యను బోధించారో అలాంటి విద్యనే ఇక్కడే బోధిస్తామని రాందేవ్ చెప్పారు. గురుకుల విద్యకు ప్రాణంపోయాలని తాను ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, మానవ వనరుల శాఖకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.