డేరా సచ్చా సౌదా విధ్వంసం.. టెన్షన్‌




చండీగఢ్‌: అత్యాచార కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు దోషిగా తేల్చడంతో హింస చెలరేగింది. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో గుర్మీత్‌ అనుచరులు పలుచోట్ల అల్లర్లకు దిగారు. హర్యానాలోని పంచకులలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. మూడు మీడియా వాహనాలకు నిప్పుపెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠిచార్జి చేసి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 70 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. పలువురు మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు నిరసనకారులు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి.



పంజాబ్‌లోని మాలౌట్‌ రైల్వే స్టేషన్‌, పెట్రోల్‌ పంపునకు నిప్పుపెట్టారు. బతిండా ప్రాంతంలోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముందుజాగ్రత్తగా ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రైల్వే శాఖ రెండు రాష్ట్రాల్లో 201 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. గుర్మీత్‌ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు చెప్పడంతో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టంచేశారు. మరోవైపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌లో మాట్లాడారు. 





పంజాబ్‌


  • ఐదు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత, కర్ఫ్యూ విధింపు

  • మన్సా ప్రాంతంలో రెండు పోలీసు వాహనాలు దగ్ధం

  • ఛనన్‌వాల్‌లో టెలిఫోన్‌ ఎక్స్ఛేంజీకి నిప్పు పెట్టిన నిరసనకారులు

  • లుథియానాలో భారీగా పోలీసులు, భద్రతా దళాల మొహరింపు




హర్యానా


  • పంచకులలో పోలీసుల కాల్పులు, ఐదుగురు మృతి

  • పంచకులలో ఆదాయపన్ను శాఖ ఆఫీసు, షాపింగ్‌ మాల్‌, ధియేటర్ల ధ్వంసం

  • పంచకుల: హోటల్‌ హాలీడే ఇన్‌ వద్ద నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ

  • సిర్సాలో ఇండియా టుడే సిబ్బందిపై దాడి, కెమెరామెన్‌ ప్రదీప్‌ గుప్తాకు గాయాలు

  • సిర్సాకు ర్యాపిడ్‌ యాక్షన్‌ బలగాలు తరలింపు

  • పంచకులకు అదనంగా 600 మంది సైనికులను తరలించిన ఆర్మీ


 


Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top