అవసరమైతే కలిసి పనిచేస్తాం

Rajinikanth And Kamal Haasan Worked Together In Tamil Politics - Sakshi

తమిళ ప్రజల సంక్షేమమే ముఖ్యం కమల్, రజనీ వ్యాఖ్య

ఎందరు వచ్చినా అన్నాడీఎంకేకు ఢోకా లేదు : మంత్రి జయకుమార్‌

సాక్షి, చెన్నై: తమిళ ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి సిద్ధమేనని మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల హాసన్, రజనీకాంత్‌ మంగళవారం వేర్వేరుగా వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం చేసి డిసెంబరుతో ఏడాది కానుంది. అయితే ఆయన ఇంత వరకు పార్టీ  ›ప్రకటన చేయలేదు. తన లక్ష్యం 2021 అసెంబ్లీ ఎన్నికలే అని చెబుతూ వస్తున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరో వైపు సమయానుగుణంగా రాజకీయ వ్యాఖ్యలను పేల్చుతూ వస్తున్నారు. అదే సమయంలో రజనీ కన్నా ముందుగా కమల్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లారు.

ఈ పరిస్థితుల్లో  ఈనెల 8న  కమల్‌ బర్త్‌డే సందర్భంగా రాజ్‌కమల్‌ కార్యాలయంలో జరిగిన దివంగత దర్శకుడు బాలచందర్‌ విగ్రహావిష్కరణకు రజనీ హాజరయ్యారు. తాను కాషాయం వలలో పడనని కమల్‌తో తన బంధం విడదీయరానిదిగా రజనీ వ్యాఖ్యానించారు. అలాగే రజనీకాంత్‌ను తనను ఎవరూ విడదీయలేరని, తమ మధ్య రహస్య ఒప్పందం ఉందని కమల్‌ వ్యాఖ్యానించి రాజకీయ చర్చకు తెరలేపారు. ఈ ఇద్దరు ఏకం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ మొదలైంది. ఇందుకు తగ్గట్టుగా మంగళవారం రజనీ వ్యాఖ్యలు చేయడం, అందుకు తగ్గట్టుగా కమల్‌  స్పందించడం ఆ చర్చలకు బలాన్ని చేకూర్చాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తమిళనాట చర్చ జోరందుకునేలా చేశాయి. 

కలిసి పనిచేయడానికి రెడీ 
రజనీ కాంత్‌ మంగళవారం మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తమిళ ప్రజల సంక్షేమం కోసం తప్పని సరి అయినా, అవశ్యమైనా కమల్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అదే సమయంలో ఒడిశాలో జరిగిన డాక్టరేట్‌ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని చెన్నైకు వచ్చిన కమల్‌ మీడియాతో మాట్లాడారు. తమిళ ప్రజల సంక్షేమం, తమిళనాడు అభివృద్ధి కాంక్షిస్తూ అవసరం అయితే రజనీకాంత్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమేనని ప్రకటించారు. తమ ఇద్దరు 44 ఏళ్లుగా సినీ రంగంలో  కలిసి పనిచేస్తున్నామని, ప్రజాహితం కోసం కలయిక అవశ్యం అయితే సిద్ధమేనని వ్యాఖ్యానించారు.  కాగా, రజనీ, కమల్, విజయ్‌ వంటి నటులు అందరూ ఏకమై వచ్చినా అన్నాడీఎంకేకు ఢోకా లేదని.. 2021 ఎన్నికల్లో మళ్లీ అధికారం అన్నాడీఎంకేకు దక్కుతుందని మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top