ఆ టిక్కెట్లన్నీ రద్దు: రైల్వే శాఖ

Railways Says All Tickets Booked for Travel Before June 30 Cancelled - Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌కు ముందు తీసుకున్న అడ్వాన్స్‌ టిక్కెట్లు అన్నీ రద్దవుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూన్ 30 వరకు ప్రయాణానికి తీసుకున్న టిక్కెట్లన్నీ రద్దవుతాయని తెలిపింది. జూన్ 30 లేదా అంతకుముందు ప్రయాణానికి మార్చి 25 లోపు బుక్ చేసుకున్న అన్ని రైలు టిక్కెట్లు రద్దు అవుతాయని, వినియోగదారులకు పూర్తి నగదు వాపసు ఇవ్వనున్నట్లు వివరించింది. ప్రత్యేక రైళ్లకు మినహా మిగిలిన అన్ని రైళ్ల రిజర్వేషన్లు జూన్‌ 30 వరకు రద్దు చేసినట్టు రైల్వేశాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌, కౌంటర్లలో రిజర్వేషన్ చేయిస్తే ఛార్జీలు తిరిగి చెల్లించనుంది.

ఆన్‌లైన్‌లో చెల్లిస్తే ప్రయాణికుల ఖాతాకు జమ చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. కౌంటర్లలో రిజర్వేషన్లు చేయించినవారికి ప్రత్యేక సదుపాయం ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి మొదలైన ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రయాణికుల రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా రైళ్ల సర్వీసులను పునరుద్ధరించి పరిమిత సంఖ్యలో రాజధాని ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతున్నారు. వలస కార్మికుల తరలింపు శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. (ఆ రైళ్లను ఎక్కువ చోట్ల ఆపండి..)

ప్రత్యేక రైళ్లకూ వెయిటింగ్‌ లిస్టు
మే 22 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్‌ లిస్టును చేరుస్తూ రైల్వే బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఇవి కేవలం ఆ రైళ్లకే గాక, తర్వాత నడపనున్న రైళ్లకూ వర్తించే అవకాశం కనిపిస్తోంది. ఏసీ 3–టైర్‌కు 100, ఏసీ 2–టైర్‌కు 50, స్లీపర్‌ క్లాస్‌కు 100, చైర్‌ కార్‌కు 100, ఫస్ట్‌ క్లాస్‌ ఏసీతో పాటు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌కు 20 చొప్పున వెయిటింగ్‌ లిస్టును కేటాయించింది. మే 15 నుంచి బుక్‌ చేసుకున్న వారికి ఇవి వర్తిస్తాయి. ప్రస్తుతం నడుపుతున్న ఎయిర్‌ కండీషన్డ్‌ రైళ్లనే గాక, ఇతర రైళ్ళను నడిపే ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది. (రైలు దిగగానే.. స్టాంప్‌ వేసేశారు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top