‘రఫేల్‌ ఒప్పందంలో రాజద్రోహానికీ పాల్పడ్డారు’

Rahul Gandhi Sharpens Rafale Attack - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్‌ ఒప్పందంపై ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఈ ఒప్పందంపై కాగ్‌ నివేదికను పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రఫేల్‌ కేవలం అవినీతి వ్యవహారమే కాదని ఇది రాజద్రోహం కేసని వ్యాఖ్యానించారు. రఫేల్‌ ఒప్పందంపై సంతకాలు జరగకముందే దీని గురించి రిలయన్స్‌ డిఫెన్స్‌కు చెందిన అనిల్‌ అంబానీకి తెలుసని వెలుగులోకి వచ్చిన ఓ ఈమెయిల్‌ నిరూపిస్తోందని పేర్కొన్నారు.

ఒప్పందం గురించి అనిల్‌ అంబానీకి ముందే తెలియడం అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని రాహుల్‌ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు కొద్ది రోజుల ముందు 2015, మార్చి 28న పంపినట్టుగా ఉన్న ఆ ఈమెయిల్‌ ఇమేజ్‌ను కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ పోస్ట్‌ చేశారు. 2015 ఏప్రిల్‌ 9-11 మధ్య ఫ్రాన్స్‌తో రఫేల్ ఒప్పందంపై ప్రధాని మోదీ సంతకం చేస్తారని ఎయిర్‌బస్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వం, అనిల్‌ అంబానీలకు ముందే తెలుసని ఈమెయిల్‌ ద్వారా వెల్లడవుతోందని, ప్రభుత్వం దీనిపై చెబుతున్నవన్నీ అసత్యాలేనని తేలిందని కపిల్‌ సిబల్‌ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ గూఢచారి పాత్రను అద్భుతంగా పోషించారని రాహుల్‌ మండిపడ్డారు.

ఈ-మెయిల్‌లో ఏముంది..?
యూరప్‌ ఏరోస్పేస్‌ కంపెనీ ఎయిర్‌బస్‌ ఎగ్జిక్యూటివ్‌ తాను అప్పటి ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి సహచరుడితో టెలిఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్టు ఈమెయిల్‌లో ప్రస్తావించారు. అనిల్‌ అంబానీ ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి కార్యాలయానికి వచ్చారని, ఒప్పంద పత్రాలు సిద్ధమవుతున్నాయని  ప్రధాని మోదీ పర్యటనలో ఎంఓయూ (అవగాహనా ఒప్పందం)పై సంతకాలు జరుగుతాయని చెప్పారని ఆ ఎగ్జిక్యూటివ్‌ ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. కపిల్‌ సిబల్‌ పోస్ట్‌ చేసిన ఈ ఈ-మెయిల్‌ రఫేల్‌ ఒప్పందంపై తాజా ప్రకంపనలకు కేంద్రమవుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top