సోనియా కంటే రాహులే పాపులర్‌

Rahul Gandhi more popular than Sonia Gandhi - Sakshi

ఐఏఎన్‌ఎస్‌–సీఓటర్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: ఓ వైపు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పాపులారిటీ తగ్గుతుండగా, మరోవైపు రాహుల్‌ గాంధీ పాపులర్‌ అవుతున్నారని ఐఏఎన్‌ఎస్‌–సీఓటర్‌ రిపబ్లిక్‌ డే ‘స్టేట్‌ ఆఫ్‌ నేషన్‌’ సర్వే వెల్లడించింది. ఈ నెల 25 వరకూ గత 12 వారాలుగా ఈ సర్వే కొనసాగిందని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. 543 పార్లమెంటు నియోజకవర్గాల్లో 30,240 మంది పౌరుల అభిప్రాయాలతో ఈ సర్వే చేపట్టారు. ఇందులో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ సంతృప్తికరంగా పని చేస్తున్నట్లు 49.5% మంది అభిప్రాయపడ్డారు. అందులో తెలంగాణాలో 50.5% మంది, కేరళలో 43.3% మంది, ఆంధ్రప్రదేశ్‌లో 37.9% మంది ఆమె పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో 14.5% మంది సంతృప్తి వ్యక్తం చేశారు.  

తల్లికంటే ముందంజలో తనయుడు..
కేరళలోని వయానాడ్‌ నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్‌ గాంధీ ఆ రాష్ట్రంలో మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. 51.9% మంది ఆయన పట్ల చాలా సంతృప్తిగా ఉన్న్టట్లు సర్వే తెలిపింది. పుదుచ్చేరిలో ఏకంగా 76% మంది చాలా సంతృప్తికంగా ఉన్నారు. మరోవైపు హరియాణాలో రాహుల్‌ పట్ల కేవలం 17.7%మంది సంతృప్తిగా ఉన్నారు.   

ప్రధానికి రాజ్యాంగం ప్రతిని పంపిన కాంగ్రెస్‌
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని  మోదీకి కాంగ్రెస్‌ వినూత్న బహుమతిని పంపింది. భారత రాజ్యాంగం ప్రతిని మోదీకి పంపినట్లు  తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. సమయం దొరికినప్పుడు ఈ ప్రతిని చదవాలని ప్రధానికి సూచించింది. ‘ప్రియమైన ప్రధాని మోదీ గారికి.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున దేశ రాజ్యాంగ ప్రతిని పంపుతున్నాము. దేశాన్ని విభజించాలనుకునే ముందు దీనిని తప్పకుండా చదవండి’అని పేర్కొంది. వీటితో పాటు అమెజాన్‌లో రాజ్యాంగ ప్రతిని కొన్న ఫొటోను కూడా ట్వీట్‌ చేసింది.   కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ నేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యాంగ ప్రవేశికను చదువుతోన్న వీడియోలను సైతం కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top