నిర్భయ ఉదంతం: రాష్ట్రపతి కీలక నిర్ణయం

President Ram Nath Kovind Rejects Nirbhaya Convict Mercy Plea - Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. దీంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు మార్గం సుగమమైంది. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఉదంతంలో నలుగురు దోషులు ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌ (31)లకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేసేలా డెత్‌వారెంట్లు జారీ అయిన విషయం తెలిసిందే. అయితే.. మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు వారు అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఈ క్రమంలో వినయ్‌ శర్మ, ముఖేశ్‌ సింగ్‌ దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆఖరి ప్రయత్నంగా... క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ముఖేశ్‌ రాష్ట్రపతికి మూడు రోజుల క్రితమే విజ్ఞప్తి చేశాడు. 

ఈ నేపథ్యంలో ప్రొటోకాల్‌ ప్రకారం.. తొలుత దోషి క్షమాభిక్ష అర్జీ ఢిల్లీ ప్రభుత్వానికి చేరగా... క్షమాభిక్షను తిరస్కరించాలని ఆప్‌ ప్రభుత్వం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు విన్నవించింది. ఆ తర్వాత క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోం శాఖకు పంపించారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర హోం శాఖ... ముఖేశ్‌ పిటిషన్‌ను తిరస్కరించాలని విఙ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపింది. ఈ నేపథ్యంలో తన అభీష్టం మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top