మహాశివరాత్రి వేడుకలకు హాజరైన రాష్ట్రపతి

The President Of India Joins In Maha Shivaratri Celebrations At Isha Yoga Center - Sakshi

చెన్నై : అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈషా యోగా కేంద్రంలో నిర్వహించిన మహా శివరాత్రి వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం సాయంత్రం కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రానికి విచ్చేసిన కోవింద్.. ఆదియోగి విగ్రహం వద్ద ‘ఆదియోగి దివ్య దర్శనం’ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌండ్‌-లైట్‌ షోను ప్రారంభించారు. దీంతో వెల్లంగిరి కొండలు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. అనంతరం ‘జ్ఞానం - ధ్యానం - ఆనందం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు కోవింద్. తర్వాత ధ్యాన లింగం, లింగ భైరవి దేవిలను దర్శించుకున్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు కోవింద్‌. ‘పరుల సేవలో తరించే జీవితమే అత్యుత్తమ జీవితం. ఇదే ఆ పరమేశ్వరుని సందేశం. మనిషి ముక్తి సాధించడానికి 112 మార్గాలున్నాయి. దాన్ని సూచిస్తూ నెలకొల్పిన ఈ 112 అడుగుల ఆదియోగి విగ్రహం ఏదుట ఈ రోజు మీ అందరిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నా’రు. అంతేకాక యువత యోగా పట్ల ఆకర్షితులవ్వడం చాలా సంతోషకరమైన పరిణామంగా చెప్పుకొచ్చారు.

ఈశా ఫౌండేషన్ 1994 మార్చి నుంచి ప్రత్యేకంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మరింత ఘనంగా శివరాత్రి వేడుకలును నిర్వహించారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమిత్ త్రివేది, హరిహరన్, కార్తీక్ తదితరులు సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. జాగరణ సందర్భంగా రాత్రంతా సంగీతం, ఫోక్ ఆర్ట్, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు దేశవిదేశాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top