సీవీ ఆనంద్‌కు రాష్ట్రపతి పోలీస్ పతకం | Sakshi
Sakshi News home page

సీవీ ఆనంద్‌కు రాష్ట్రపతి పోలీస్ పతకం

Published Tue, Aug 15 2017 2:41 AM

సీవీ ఆనంద్‌కు రాష్ట్రపతి పోలీస్ పతకం

  • మరో 11 మందికి ఇండియన్‌ పోలీసు మెడల్‌
  • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటన
  • ఆనంద్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఎక్సలెన్స్‌ అవార్డు కూడా..
  • ప్రమీలాబాయికి రాష్ట్రపతి కరెక్షనల్‌ సర్వీస్‌ మెడల్‌
  • సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏటా కేంద్రం ప్రకటించే అత్యుత్తమ సేవా పతకాలకు ఈసారి రాష్ట్రం నుంచి 13 మంది పోలీసు అధికారులు ఎంపికయ్యారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్, మెట్రో రైల్‌ విభాగంలో పని చేస్తున్న అదనపు డీసీపీ ఎ.బాలకృష్ణలకు రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం) దక్కాయి. కేంద్ర హోం శాఖ సోమవారం ఈ మేరకు ప్రకటించింది.

    మరో 11 మంది పోలీసు అధికారులకు ఇండియన్‌ పోలీస్‌ మెడల్స్‌ దక్కాయి. పౌర సరఫరాల శాఖను గాడిలో పెట్టేందుకు సీవీ ఆనంద్‌ చేసిన కృషిని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఎక్సలెన్స్‌ అవార్డు ప్రకటించింది. శాఖలో ఈ ఏడాదిలో ఆయన చేపట్టిన వినూత్న చర్యలతో ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల దాకా ఆదా అయింది. ప్రత్యేక మహిళా కారాగారం చీఫ్‌ హెడ్‌వార్డర్‌ ఎ.ప్రమీలా బాయికి రాష్ట్రపతి కరెక్షనల్‌ సర్వీస్‌ మెడల్‌ దక్కింది.

    ఐపీఎం పొందింది..: చిక్కడపల్లి ఏసీపీ జే నర్సయ్య, ఏసీబీ డీఎస్పీ మిర్యాల ప్రభాకర్, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ ఆర్‌ జగదీశ్వర్‌ రెడ్డి, డీజీపీ సెంట్రల్‌ స్టోర్‌ డీఎస్పీ పాక గిరిరాజు, సీఐ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ టీఆర్‌ రాజేశ్వర్‌ లక్ష్మీ, గ్రేహౌండ్స్‌ ఆర్‌ఐ పాకంటి భూపాల్‌రెడ్డి, వరంగల్‌ సిటీ ఏఎస్‌ఐ బూర్గుల మహేందర్, కరీంనగర్‌ బెటాలియన్‌ ఏఆర్‌ఎస్‌ఐ తూడి ప్రభాకర్, ఇంటెలిజెన్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం రఘుపతిరావు, అంబర్‌పేట్‌ సీపీఎల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఎండీ ఖైరుద్దీన్, సీఐ సెల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పి.జీవానందం.

Advertisement
Advertisement