ప్రసవం అయిన 2 గంటలకే 150కిమీ నడక

Pregnant Migrant Lady Walks Another 150 km After Delivery - Sakshi

భోపాల్‌ : కరోనా పాడుగాను.. వలస జీవుల బతుకులను ఎంత ఇరకాటంలోకి నెట్టిందో. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలను రోడ్డు పాలు చేసింది. ఉపాధి కోసం సొంతూళ్లను వదిలి వేరే రాష్ర్టాలకు వెళ్లిన కార్మికులు ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. మరీ ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయసు పైబడిన వారి కష్టాలు వర్ణణాతీతం. ఈ పయనంలో నెలలు నిండిన గర్భిణీలు రోడ్డు పక్కనే బిడ్డలకు జన్మనిస్తున్నారు.

అలాంటి ఓ విషాదకర సంఘటన వివరాలు.. మధ్యప్రదేశ్‌ సాత్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రాకేశ్‌ కౌల్‌, శకుంతల దంపతులు.. కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌కు ఉపాధి కోసం వలస వెళ్లారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో వారికి ఉపాధి కరువైంది. దాంతో ఇక్కడే ఉండి ఆకలితో అలమటించే కన్నా సొంతూరు వెళ్లి అయిన వారితో కలిసి ఉందామనుకున్నారు. అయితే శకుంతల నిండు గర్భిణీ. అయినప్పటికీ వారు సొంత ఊరు వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. దాంతో  ఈ నెల 5వ తేదీన మహారాష్ట్ర నాసిక్‌ నుంచి మధ్యప్రదేశ్‌ సాత్నాకు నడక ప్రారంభించారు. 

ఈ క్రమంలో మంగళవారం శకుంతలకు నొప్పులు ప్రారంభమయ్యాయి. దాంతో ఆమె రోడ్డు మీదనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకుని.. మళ్లీ నడక ప్రారంభించింది. తన పసిబిడ్డను ఎత్తుకుని.. ఎర్రటి ఎండలో 150 కిలోమీటర్లకు పైగా నడిచింది ఆ బాలింత. ఈ విషయం గురించి సాత్న వైద్య అధికారి ఏకే రాయ్‌ మాట్లాడుతూ.. ‘శకుంతల దంపతుల గురించి మాకు తెలిసిన వెంటనే సరిహద్దు వద్ద వారి కోసం బస్సు ఏర్పాటు చేశాం. అనంతరం తల్లీబిడ్డలను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాం. ఇద్దరు క్షేమంగా ఉన్నారు’ అని తెలిపారు.
చదవండి: కరోనా వదలదు.. ప్రభుత్వాలకు పట్టదు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top