
మతం ముసుగులో ద్వేషాలను రగల్చొద్దు:ప్రణబ్
ప్రజల్లో విద్వేషాలను రగిల్చేందుకు మతాన్ని ఉపకరణంగా వినియోగించరాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హితవు పలికారు.
మిడ్నాపూర్: ప్రజల్లో విద్వేషాలను రగిల్చేందుకు మతాన్ని ఉపకరణంగా వినియోగించరాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హితవు పలికారు. దేశంలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మత ఘర్షణలు చోటుచేసుకోవటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారమిక్కడ విద్యాసాగర్ యూనివర్సిటీలో నిర్వహించిన పండిత్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్మారక ఉపన్యాసంలో ఆయన మాట్లాడారు. మత ఘర్షణల్లో అత్యాచారాలు, హింస చోటుచేసుకోవటం విషాదకరమని పేర్కొన్నారు. స్త్రీలు, బాలికలను గౌరవించకుంటే అది నాగరిక సమాజం అనిపించుకోదని తెలిపారు.
హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయటం సమస్యకు పరిష్కారం కాదని, సమాజంలో నైతిక విలువలు పతనం కావటంపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులను కోరా రు. ప్రపంచంలోని 200 ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యాసంస్థలకు చోటు దక్కకపోవటంపై ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిభావంతులైన అధ్యాపకులకు కొరత లేకున్నా విద్యావ్యవస్థలో ఏదో లోపం ఉందన్నారు.