ఆరు పట్టణాల్లో క్రైమ్‌ సీన్‌ చిత్రీకరణ

Police In Delhi, 5 Other Cities To Now Record Crime Scenes On Video - Sakshi

జాబితాలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు

సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, అహ్మదాబాద్‌లలో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ తరువాత దేశమంతా ఈ పద్ధతిని అమలుచేసేందుకు ఆరు నెలల గడువు కోరింది. ఈ మేరకు కేంద్రం కోర్టులో ఒక అఫిడవిట్‌ దాఖలుచేసింది. నేర విచారణను చిత్రీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు గతంలో కేంద్రాన్ని ఆదేశించడం తెల్సిందే. ఈ విషయంలో చొరవచూపిన గుజరాత్‌.. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ‘మొబైల్‌ పాకెట్‌ యాప్‌’ అనే అప్లికేషన్‌కు అనుసంధానమయ్యే ఒక సెంట్రల్‌ సర్వర్‌ను రూపొందించింది.

పోలీస్‌ స్టేషన్‌కు సమకూర్చిన ప్రతి సెల్‌ఫోన్‌లో ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గుజరాత్‌ నమూనా ఆధారంగా బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రూపొందించిన మరో యాప్‌ను పరీక్షించాలనుకుంటున్నట్లు కోర్టు తెలిపింది. ‘నేర విచారణ చిత్రీకరణకు సంబంధించి గుజరాత్‌ మంచి పురోగతి సాధించింది. మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఉపయోగించేలా ఒక సమగ్ర నమూనాను కేంద్రం రూపొందిస్తుందని ఆశిస్తున్నాం’ అని జస్టిస్‌ యూయూ లలిత్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కేంద్రం తరఫున విచారణకు హాజరైన లాయర్‌ శిరిన్‌ ఖాజురియా మాట్లాడుతూ..కోర్టు గత ఉత్తర్వుల మేరకు కేంద్రీయ పర్యవేక్షణ విభాగం(సీఓబీ) ఏర్పాటైందని తెలిపారు. నేరం జరిగిన చోటును వీడియోతీసే ప్రణాళికపై సీఓబీ తొలి సమావేశం మే 24న నిర్వహించారని చెప్పారు.నేరం జరిగిన చోటును వీడియో తీసే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సమయం ఆసన్నమైందని ఏప్రిల్‌ 5న కోర్టు వ్యాఖ్యానించింది. పోలీసు విచారణలో వీడియోగ్రఫీ వినియోగం, కాల పరిమితిపై హోం శాఖ నియమించిన కమిటీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆమోదిస్తూ ఈ విధంగా స్పందించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top