
వర్షం ధాటికి కుప్పకూలిన తాజ్‌మహల్ ప్రవేశద్వారం పిల్లర్
సాక్షి, ఆగ్రా : ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్‌మహల్ ప్రవేశ ద్వారంలోని పిల్లర్ ధ్వంసమైంది. గురువారం ఉదయం కుండపోత వర్షంతో పాటు పెనుగాలుల ధాటికి కట్టడానికి దక్షిణ దిశగా ఉన్న ప్రవేశద్వారం పిల్లర్ కూలిందని అధికారులు తెలిపారు. చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రేమకు సంకేతంగా 17వ శతాబ్ధంలో నిర్మించిన ఈ చారిత్రక కట్టడానికి పర్యాటకులు పోటెత్తుతుండటం, వాహన కాలుష్యం పెరుగుతున్న క్రమంలో తాజ్ మహల్‌లోకి వీక్షకులను కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు.
మరోవైపు యూపీలో భారీ వర్షాలకు మధురలో ఓ ఇల్లు కూలడంతో ముగ్గురు చిన్నారులు మరణించారు. దినసరి కూలీలుగా పనిచేస్తున్న చిన్నారుల తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. లక్నో, కాన్పూర్, మధుర, కన్నౌజ్, ఫరక్కాబాద్, ఇటావా, మెయిన్‌పురి సహా యూపీలోని పలు ప్రాంతాల్లను వర్షాలు ముంచెత్తాయి. అకాల వర్షాలతో నంద్‌గావ్, బృందావన్, కోసికలాన్ తదితర ప్రాంతాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది.