భారత విమానాన్ని వెంబడించిన పాక్‌ వాయుసేన

Pakistan F 16 Jets Intercepted Delhi Kabul Spicejet Flight - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన స్పైస్‌జెట్‌ విమానాన్ని పాక్‌ వాయుసేన విమానాలు వెంబడించాయి. ఈ ఘటన సెప్టెంబర్‌ 23న చోటుచేసుకున్నట్టు సివిల్‌ ఏవియేషన్‌ వర్గాల తెలిపాయి. వివరాల్లకి వెళితే.. సెప్టెంబర్‌ 23న ఢిల్లీ నుంచి కాబూల్‌కు 120 మంది ప్రయాణికులతో స్పైస్‌జెట్‌ విమానం బయలుదేరింది. మార్గమధ్యలో పాక్‌ గగనతలంలోకి ప్రవేశించగానే.. ఆ దేశ వాయుసేనకు చెందిన రెండు ఎఫ్‌-16 జెట్స్‌  స్పైస్‌జెట్‌ విమానాన్ని వెంబడించడం ప్రారంభించాయి. ఇరువైపుల నుంచి స్పైస్‌జెట్‌ను ముట్టండించాయి. పాక్‌ జెట్స్‌లోని పైలట్‌లు.. భారత విమానం ప్రయాణిస్తున్న ఎత్తును తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఫ్లైట్‌ సర్వీసు వివరాలు సమర్పించాల్సిందిగా కోరారు. దీంతో స్పైస్‌జెట్‌ కెప్టెన్‌.. ఇది భారత్‌కు చెందిన విమానమని.. ప్రయాణికులతో కాబూల్‌ వెళ్తుందని వారికి తెలియజేశాడు.

పాకిస్తాన్‌ ఏటీసీ అధికారులు.. స్పైస్‌జెట్‌ ఫ్లైట్‌ కోడ్‌ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా సమాచారం. సాధారణంగా ప్రతి విమానానికి ఒక కోడ్‌ ఉంటుంది.. అలాగే స్పైస్‌జెట్‌కు ‘SG’ అని ఉంటుంది. అయితే స్పైస్‌జెట్‌ కోడ్‌ను ‘IA’గా అర్థం చేసుకున్న పాకిస్తాన్‌ ఏటీసీ అధికారులు.. దానిని భారత ఆర్మీకి గానీ, వాయుసేనకు చెందినదని భావించారు. వెంటనే ఆ విమానాన్ని పరీక్షించడానికి ఎఫ్‌-16 విమానాలను రంగంలోకి దించారు. అయితే స్పైస్‌జెట్‌ కెప్టెన్‌ పాక్‌ వాయూసేన అనుమానాలను నివృత్తి చేసిన తర్వాత కూడా.. భారత విమానం పాక్‌ గగనతలం దాటి అఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించే వరకు ఎఫ్‌-16 విమానాలు వెనకాలే వచ్చాయి. కాగా, పాక్‌ గగనతలంలోకి భారత విమానాలపై నిషేధం లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ ఘటనపై ఆ సమయంలో ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికుడు ఒకరు తన అనుభవాన్ని ఏఎన్‌ఐతో పంచుకున్నారు. ‘మేము ప్రయాణిస్తున్న విమానాన్ని వెంబడించిన పాక్ జెట్స్‌ ఫైలట్‌లు చేతి సైగల ద్వారా మా విమానాన్ని కిందికి దించాలని డిమాండ్‌ చేశారు. అలాగే స్పైస్‌జెట్‌ సిబ్బంది కూడా  కిటికీలను కప్పివేయాలని.. నిశ్శబ్ధం పాటించాలని ప్రయాణికులను కోరార’ని తెలిపారు. అయితే ఆ ప్రయాణికుడు తన వివరాలను గోప్యంగా ఉంచాలని కోరాడు. కాబూల్‌లో విమానం క్షేమంగా ల్యాండ్‌ అయిన తర్వాత తిరుగు ప్రయాణం దాదాపు ఐదు గంటల పాటు ఆలస్యం అయింది. ఈ ఘటనపై కాబూల్‌లోని పాకిస్తాన్‌ ఎంబసీ అధికారులు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top