పరోక్ష యుద్ధంలోనూ పాక్‌కు ఓటమే

Pakistan chose proxy war through terrorism, will be defeated - Sakshi

పుణే: ప్రత్యక్ష యుద్ధంలో ఎలాగూ గెలవలేమనే పాకిస్తాన్‌ పరోక్ష యుద్ధానికి ప్రయత్నిస్తోందని అయితే ఇందులోనూ ఆ దేశానికి ఓటమి తప్పదని దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. పుణేలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ శనివారం జరిగిన 137వ పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌లో ఆయన మాట్లాడారు.‘ సంప్రదాయ యుద్ధమైనా, పరిమిత యుద్ధమైనాసరే తాను భారత్‌పై గెలవలేనని పాకిస్తాన్‌కు 1848 నుంచే తెలుసు. 1965, 1971, 1999ల్లోనూ ఇదే విషయం రూఢి అయ్యింది’ అని అన్నారు. ‘పాకిస్థాన్‌ ఉగ్రవాదం రూపంలో పరోక్ష యుద్ధ మార్గాన్ని ఎన్నుకుంది. కానీ ఇందులోనూ ఆ దేశానికి దక్కేది ఓటమే’ అని చెప్పారు. భారత్‌ ఎల్లప్పుడు ఇతర దేశాలతో సౌహార్దపూర్వక, స్నేహపూరిత సంబంధాలను కోరుకుందని, పరాయి భూభాగాన్ని ఆక్రమించాలన్న ఆలోచన భారత్‌కు లేదని, కానీ రెచ్చగొడితే ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.

సైబర్‌ యుద్ధాన్నీ కాచుకోవాలి..
ఉగ్రవాదంతోపాటు ప్రపంచం ఇప్పుడు తమ సిద్ధాంతాల ప్రచారానికి ద్వేషాన్ని వ్యాప్తి చేసే సైబర్‌ యుద్ధ రీతులను ఎదుర్కోవాల్సి ఉందని రాజ్‌నాథ్‌ చెప్పారు. శాంతి పరిరక్షణ, మానవతా కార్యక్రమాల్లో భారత సైన్యం ఎంత నైపుణ్యంతో పనిచేస్తుందో ఇప్పుడు అందరికీ తెలుసునని మంత్రి పేర్కొన్నారు. ‘మీరు దేశ రక్షణ వ్యవస్థలో భాగమైనప్పుడు భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని తీర్మానం చేసుకోండి. రాజ్యాంగ పరిరక్షణ అనేది అటు మిలటరీ, ఇటు పౌర సమాజాన్ని కలిపి ఉంచే బంధం’’అని మంత్రి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ కేడెట్స్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సైనిక దౌత్యానికీ ప్రాధాన్యమిస్తోందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top