ఇంటి కంటే రెస్టారెంట్‌ పదిలం | North Indian vegetarian food is the king in India | Sakshi
Sakshi News home page

ఇంటి కంటే రెస్టారెంట్‌ పదిలం

Jun 16 2019 4:46 AM | Updated on Jun 16 2019 5:36 AM

North Indian vegetarian food is the king in India - Sakshi

వీకెండ్‌ వచ్చిందంటే చాలు భార్యా పిల్లలతో కలిసి బయటకు వెళ్లి సరదా సరదాగా షాపింగ్‌ చేసి మల్టీప్లెక్స్‌లో మూవీ చూసి, తర్వాత రెస్టారెంట్‌లో ఇష్టమైన ఫుడ్‌ లాగిస్తేనే  భారతీయులకు అదో తుత్తి. ఒకప్పడు బయట హోటల్స్‌కు వెళ్లాలంటే బర్త్‌డే, మ్యారేజ్‌డే ఇలా ఏదో ఒక ఫంక్షన్‌ ఉంటేనే వెళ్లేవారు. ఇప్పుడు భారతీయుల మైండ్‌ సెట్‌ మారింది. శని ఆదివారాలు ఎన్ని రకాల వినోదాలున్నా హోటల్‌కి వెళ్లి చేతులు కడగవలసిందే.  ప్రతీ నెలలో కనీసం ఏడుసార్లు భారతీయ కుటుంబాలు  రెస్టారెంట్లలో తినడానికే ఇష్టపడుతున్నారని నేషనల్‌ రెస్టారెంట్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సర్వేలో తేలింది. దీని కోసం భారతీయులు నెలకి సగటున రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ఇక స్విగ్గీలు, జోమాటో, యూబర్‌ ఈట్స్‌ వంటి యాప్‌లు వచ్చాక హోటల్‌ నుంచి ఇంటికి తెప్పించుకోవడాలు పెరిగిపోయాయి. అలా దేశ ప్రజలు నెలకి సగటున 6.6 సార్లు బయట తిండే తింటున్నారు. ఫుడ్‌ ట్రక్‌లు, ఫుడ్‌ పార్క్స్‌ , టేక్‌ ఎవేలు, హోమ్‌ డెలివరీలు అందుబాటులోకి వచ్చాక, ఆతిథ్య రంగం కొత్త దారి పట్టిందని, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే ఇంటి భోజనమనే భావన వస్తే ఇంటి కన్నా రెస్టారెంట్లకి రావడానికే జనం ఇష్టపడుతున్నారని ఢిల్లీకి చెందిన రెస్టారెంట్‌ యజమాని అనురాగ్‌ కటియార్‌ వెల్లడించారు. నాలుగ్గోడల మధ్య మగ్గిపోతూ బయట నుంచి తెప్పించుకునే తిండి తినేకంటే, కాస్త ఆరుబయట గాలి పీల్చుకుంటూ రెస్టారెంట్‌లో యాంబియెన్స్‌ను ఎంజాయ్‌ చేస్తూ వేడివేడిగా తినడానికే 80 శాతం మంది భారతీయులు ఇష్టపడుతున్నారని ఎన్‌ఆర్‌ఏఐ సర్వేలో తేటతెల్లమైంది.  

ఎవరి టేస్ట్‌ వాళ్లదే
రకరకాల ఘుమాయించే వంటకాలు,విభిన్న రుచులు, వైవిధ్యమైన డిషెస్‌ ఇప్పుడు ప్రతీచోటా  దొరుకుతున్నాయి. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టుగా ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్‌.. ఢిల్లీ వాసులకి స్థానికంగా దొరికే ఆహారం పట్ల మోజు లేదు. నార్త్‌ ఇండియన్‌ ఫుడ్‌ చూస్తేనే వారికి నోరూరుతుంది. బెంగుళూరులో దక్షిణాది వంటకాలపై అంతగా మోజు లేదు. నార్త్‌ ఇండియన్‌ మీల్స్, హైదరాబాదీ బిర్యానీలనే ఇష్టపడతారు. ఇక వెరైటీ రుచుల్ని ఆస్వాదించడంలో ముంబైకర్ల తీరే వేరు. దక్షిణాది రుచులకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు, దోసె, ఇడ్లీలను అత్యంత ఇష్టంగా లాగిస్తారు. ఇతర దేశాల వంటకాల్లో 33% మంది ఇటాలియన్‌ ఫుడ్‌ అంటే పడిచచ్చిపోతే, 29% మందికి చైనీస్‌ ఫుడ్‌ తింటేనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి తప్ప ఎంతకని ఆ బయట తిండి తింటాం, ఇంట్లో చారు అన్నం తిన్నా  అదే అమృతంలా అనిపిస్తుంది కదా అని 20శాతం మంది అభిప్రాయపడినట్టుగా సర్వేలో తేలింది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement