నవీన్‌తో నితీష్‌ సంప్రదింపులు

Nithesh Consultations With Naveen - Sakshi

రాజ్యసభ డిçప్యూటీ చైర్మన్‌ ఎన్నిక మంతనాలు

భువనేశ్వర్‌ : రాజ్య సభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్రంలో అధికార పక్షం బిజూ జనతా దళ్‌తో ఎన్‌డీఏ వర్గాలు మంతనాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జేడీ(యు) అధినేత, బీహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ  జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌తో ప్రత్యక్షంగా ఫోన్‌ సంప్రదింపులు జరిపారు. రాజ్య సభ సభ్యుడు పి.జె. కురియన్‌ పదవీ కాలం ఈ ఏడాది జూన్‌ 30వ తేదీతో ముగియడంతో ఈ పదవికి ఎన్నిక నిర్వహిస్తున్నారు.

రాజ్యసభ డిప్యుటీ చైర్మన్‌ ఎన్నిక ఈ నెల 9వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికలో జేడీ (యు) అభ్యర్థి, రాజ్యసభ సభ్యుడు హరివంశ నారాయణ సింగ్‌ పోటీ చేస్తున్నారు. ఆయనకు  ఎన్‌డీఏ మద్దతు ప్రకటించింది. ఈ తరుణంలో బీజేడీ కూడా అండగా నిలవాలని నితీష్‌ కుమార్‌ బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఫోనులో సంప్రదింపులు జరిపినట్లు బీజేడీ పార్టీ అధికార ప్రతినిధి సుస్మిత్‌ పాత్రో తెలిపారు. 

నవీన్‌ పట్నాయక్‌దే తుది నిర్ణయం

రాజ్య సభ డిప్యూటీ చైర్మన్‌ అభ్యర్థికి మద్దతు విషయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌దే తుది నిర్ణయం. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సంప్రదింపులపట్ల నవీన్‌ పట్నాయక్‌ స్పందన స్పష్టం చేయలేదు. ఎన్నికకు ఒక రోజు ముందుగా బుధ వారం బిజూ జనతా దళ్‌ వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. 

ప్రముఖుల సంప్రదింపులు

జనతా దళ్‌ (యు) అధినేత నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఫోన్‌ సంప్రదింపులు జరిపిన కాసేపటికే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ వంటి ప్రముఖులు నవీన్‌ పట్నాయక్‌తో ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్‌సీపీ అభ్యర్థి వందనా చవాన్‌ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవికి ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేడీ మద్దతు ప్రకటించి సహకరించాలని ఎన్‌సీపీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ను మంగళవారం ఫోన్‌ సంభాషణలో అభ్యర్థించారు.

అంతు చిక్కని నవీన్‌ వైఖరి 

జాతీయ రాజకీయ వ్యవహారాల్లో బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడి హోదాలో నవీన్‌ పట్నాయక్‌ వైఖరి ఊహాతీతం. ఆయన ఏ క్షణంలో ఏ నిర్ణయం ప్రకటిస్తారో  సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. జాతీయ రాజకీయాల్లో ఉభయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలతో సమాన దూరంలో ఉంటామని నవీన్‌ పట్నాయక్‌ తరచూ బహిరంగంగా ప్రకటిస్తుంటారు. కీలకమైన సందర్భాల్లో ఆచితూచి అడుగు వేసి ఔరా అనిపిస్తారు. లోగడ ఉపరాష్ట్రపతి ఎన్నిక పురస్కరించుకుని కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ ప్రతిపాదిత అభ్యర్థి గోపాల కృష్ణ గాంధీకి బిజూ జనతా దళ్‌ మద్దతు ప్రకటించారు.

భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఎన్నికను పురస్కరించుకుని ఎన్‌డీఏ మద్దతు అభ్యర్థికి బీజేడీ మద్దతు అందించింది. తాజాగా జరగనున్న రాజ్య సభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో బీజేడీ అనుకూలత ఎటు వైపు ఒరుగుతుందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పి.ఎ.సంగ్మా రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించిన బిజూ జనతా దళ్‌తో జనతాదళ్‌ (యు) మద్దతు ప్రకటించి అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలో జనతా దళ్‌ (యు) అభ్యర్థికి బీజేడీ మద్దతు లభించే అవకాశం కూడా లేకపోలేదు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top