మేమేం తప్పుచేశాం: నిర్భయ తల్లి భావోద్వేగం

Nirbhaya Mother Says She Die Every Day When See Convicts Of Nirbhaya - Sakshi

న్యూఢిల్లీ: ‘న్యాయం కోసం ఏడేళ్లుగా నేను చాలా ఓపికగా పోరాడుతున్నాను. అయితే 2012 నాటికి.. నేటికీ ఏమీ మారలేదు. ఈ న్యాయపోరాటంలో నాకు నేనే ప్రశ్నగా మారాను’ అంటూ నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన నిర్భయ అత్యాచార ఉదంతం జరిగి నేటికి ఏడేళ్లు. ఈ సందర్భంగా ఆజ్‌తక్‌ చానల్‌ సోమవారం నిర్వహించిన మహిళా భద్రత అంశంపై చర్చలో ఆశాదేవి పాల్గొన్నారు. ఈ క్రమంలో తన కూతురికి న్యాయం జరిగేందుకు తాను పోరాడిన తీరు, అనుభవిస్తున్న మానసిక వేదన గురించి ఆమె చెప్పుకొచ్చారు. అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలంటే ఆమెతో సహా ఆమె కుటుంబం మొత్తం పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

‘ ఆ దోషులను(నిర్భయ దోషులు) కోర్టులో చూసిన ప్రతీసారీ నేను చచ్చిపోయినట్లుగా అనిపిస్తుంది. నాలాగే నా కూతురికి ఈ పరిస్థితి ఎదురవనందుకు సంతోషం. వాళ్లను చూసేందుకు ఈ రోజు నా కూతురు బతికి లేనందుకు కాస్త సంతోషంగా ఉంది. లేకుంటే తాను కూడా ఎంతో వేదన అనుభవించేది’ తనకు ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న అత్యంత హేయమైన నేరాల గురించి స్పందిస్తూ... ‘ మా కూతుళ్లు ఏం తప్పు చేశారు. వాళ్లపై ఎందుకు అత్యాచారాలకు పాల్పడి కాల్చివేస్తున్నారు. తల్లిదండ్రులుగా మా తప్పేం ఉంది. మేము ఇంకా ఎన్నాళ్లు న్యాయం కోసం ఎదురుచూడాలి.  ఓవైపు న్యాయపోరాటం జరుగుతుండగానే.. మరోవైపు అత్యాచారాలు, ఆడపిల్లల సజీవ దహనాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి సమస్యలకు వ్యవస్థ, సమాజం ఎందుకు పరిష్కారాలను కనుగొనలేకపోతుంది’ అని ఆశాదేవి ప్రశ్నించారు.(చదవండి: సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్‌ వద్ద ఇంకా.. )

ఇక ఈ చర్చలో పాల్గొన్న ఆలిండియా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ మాట్లాడుతూ... పురుషులు, మహిళలు సమానమే అని రాజ్యాంగం చెబుతున్నా.. వాస్తవంగా అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదన్నారు. లింగవివక్ష తొలగి, చట్టాల పట్ల పూర్తి అవగాహన వచ్చినపుడే ఇలాంటి సామాజిక సమస్యలు తొలగుతాయని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎంపీ బహుగుణ జోషి మాట్లాడుతూ... మహిళల భద్రతకై సమాజం, జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చి బాధితులకు అండగా గళం వినిపించినపుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. ఇక వ్యవస్థలో ఉన్న లొసుగుల కారణంగానే దోషులు తప్పించుకుంటున్నారని, చట్టాలు కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అప్నాదళ్‌ జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ అనుప్రియా పటేల్‌ పేర్కొన్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top