ఎన్‌సీఆర్‌బీ నివేదికలో ‘డేటా’ గల్లంతు!

Nation Crime Records Bureau Data: Politicised Crime Statistics - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2017లో దేశంలో జరిగిన వివిధ రకాల నేరాల గురించి సమాచారాన్ని సేకరించి, వాటిని విశ్లేషించిన ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)’ సోమవారం ఆ డేటాకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. 2018లోనే విడుదల చేయాల్సిన ఈ డేటాను ఏడాది ఆలస్యంగా విడుదల చేయడానికి కారణం ఏమిటో వివరించలేదు. విడుదల చేసిన డేటాలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. దేశంలో చోటు చేసుకున్న మూక హత్యలు, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు చేసిన లేదా చేయించిన హత్యల వివరాలు, కాపు పంచాయతీల ఆదేశాల మేరకు జరిగిన హత్యలు, మత ఘర్షణల్లో చనిపోయిన వారి డేటాను విడుదల చేయలేదు.

ఈ నేరాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించినప్పటికీ డేటాను ప్రచురించక పోవడం ఆశ్చర్యంగా ఉందని, దీన్ని చివరి నిమిషంలో ప్రచురించకుండా ఎందుకు నిలిపివేశారో ఉన్నతాధికారులకే తెలియాలని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. దేశంలో 2017లో గోరక్షణ పేరిట మూక హత్యలు, మత విద్వేష సంఘటనలు ఎక్కువగా జరిగాయి. ‘పిల్లలను ఎత్తుకుపోయే కిడ్నాపర్లు వచ్చారు’ అంటూ సోషల్‌ మీడియా ప్రచారం వల్ల జరిగిన హత్యల వివరాలు కూడా డేటా నుంచి పూర్తిగా మాయమయ్యాయి. పైగా ఈ సారి నివేదికలో ముడుపెన్నడూ లేనిది ‘జాతి వ్యతిరేక శక్తుల’ పేరిట మూడు కొత్త కేటగిరీలను చేర్చారు. 

వాటిలో ఒకటి ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటుదారులు, రెండు నక్సలైట్లు లేదా వామపక్ష తీవ్రవాదుల, మూడు జిహాది టెర్రరిస్టులు సహా టెర్రరిస్టులు. ఈ మూడు వర్గీకరణల కిందకు వచ్చే వారంతా జాతి వ్యతిరేక శక్తులంటూ వారు ఇంత వరకు భారతీయ శిక్షా స్మతి, ఆయుధాల చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద చేసిన నేరాల గురించి వెల్లడించారు. టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన హిందువుల గురించి ఇచ్చారు. హిందువుల దాడుల్లో మరణించిన ముస్లింల గురించి ఎక్కడా, ఏ కేటగిరీ కింద కూడా ఇవ్వలేదు. 

డేటాలో పలు నేరాలకు సంబంధించిన వివరాలు గల్లంతవడం వెనక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు. ఇలా జరగడం ఇదే కొత్త కాదు. బీజీపీ ప్రభుత్వం తన రాజకీయ లక్ష్యాల కోసం గత కొన్ని ఏళ్లుగా ఇలాంటి సమాచారాన్ని దాస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఒక్క నేరాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అనేక గణాంకాల వివరాలను తొక్కిపెట్టింది. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగుల శాతం వివరాలను దాచేయడమే కాకుండా మూడు నెలలకోపారి నిరుద్యోగంపై జరిగే సర్వేలను నిలిపి వేసింది. 

2011 జనాభా లెక్కలకు సంబంధించి కులాల విశ్లేషణా వివరాలను కూడా 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను కూడా బీజేపీ ప్రభుత్వం తొక్కి పెడుతూ వస్తోంది. ఇలా చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమే కాదు. ఇలాంటి నేరాలు, ఆర్థిక గణాంకాలు విడుదల చేయకపోతే భవిష్యత్తుతో నేరాలను అరికట్టేందుకు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు విధాన నిర్ణయాలు తీసుకోవడం ఎలా సాధ్యం అవుతుందని మేథావులు ప్రశ్నిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top