అన్నిటికీ అతీతం యోగా

Narendra Modi on International Yoga Day - Sakshi

జీవితంలో అది ఒక భాగం కావాలి

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ

ఐరాసతోపాటు ప్రపంచవ్యాప్తంగా యోగా ఉత్సవాలు

రాంచీ/ న్యూఢిల్లీ/ ఐరాస: భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా అన్నిటికీ అతీతమైందని, దీనిని జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అదేవిధంగా పార్లమెంట్‌ హాల్లో, ఐక్యరాజ్యసమితిలో, ఇతర దేశాల్లోనూ ఈ కార్యక్రమాలు జరిగాయి. రాంచీలోని ప్రభాత్‌ తారా గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 40 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడిగా మారిన ప్రధాని మోదీ వివిధ ఆసనాల విశిష్టతను వివరిస్తూ ఆసనాలు వేయించారు.

ఆరోగ్యం కోసం యోగా
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా కుల, మత, వర్ణ, లింగ, ప్రాంతీయ వంటి విభేదాలకు అతీతమైంది. అందుకే దీనిని జీవితంలో అంతర్భాగంగా మార్చుకోవాలి’ అని సూచించారు. ‘నగరాల నుంచి పల్లెలు, గిరిజన ప్రాంతాలకు యోగాను వ్యాపింపజేయాలి. గిరిజనుల జీవితాల్లో యోగాను విడదీయరాని భాగంగా మార్చాలి. ఆరోగ్యవంతమైన శరీరం, స్థిరమైన మనస్సు, ఏకాత్మతా భావం అనే మూడు యోగా విశిష్టతలు ఏమాత్రం మారలేదు. జ్ఞానం, కర్మ, భక్తి అనే మూడింటి సమ్మేళనమే యోగ’ అని ప్రధాని వివరించారు.

శాంతి, సామరస్యాలను సాధించే యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తప్పనిసరిగా ఆచరించాలన్నారు. ‘ఈ రోజుల్లో యువత గుండె జబ్బులకు ఎక్కువగా గురవుతున్నారు. గుండె జబ్బుల బెడద నుంచి కాపాడుకునేందుకు యోగా మంచి ఆయుధం. ఈ దిశగా వారిని అప్రమత్తం చేయాల్సి ఉంది. అందుకే ఈ ఏడాది యోగా డేకు ‘హృదయం కోసం యోగా’ నినాదాన్ని ఇతివృత్తంగా పెట్టుకున్నాం. అనారోగ్య సమస్యల నుంచి రక్షించే ముఖ్య సాధనంగా యోగాను మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని చెప్పారు. తెల్లటి దుస్తులు, టీ షర్టు, స్కార్ఫుతో వచ్చిన ప్రధాని ప్రసంగం అనంతరం స్టేజీ దిగి అందరితో కలిసి కూర్చుని వివిధ ఆసనాలు, ప్రాణాయామం చేయించారు.  

రాష్ట్రపతి భవన్‌లో..:  రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. పార్లమెంట్‌ పరిసరాల్లో జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పాల్గొన్నారు. ఢిల్లీ రాజ్‌పథ్‌లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, రోహ్‌తక్‌లో హోం మంత్రి అమిత్‌ షా, నాగ్‌పూర్‌లో నితిన్‌ గడ్కారీ పాల్గొన్నారు. ప్రవాసీ భారతీయ కేంద్రంలో విదేశాంగ మంత్రి జై శంకర్‌ నేతృత్వంలో జరిగిన యోగాడే కార్యక్రమంలో 60 దేశాల రాయబారులు పాల్గొన్నారు. చైనా, బ్రిటన్, ఇజ్రాయెల్‌ దేశాల్లోనూ యోగా డే పాటించారు. అంతర్జాతీయ యోగా ఉత్సవాల్లో పాల్గొన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన,         నేల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ఐరాసలో మార్మోగిన ఓం శాంతి...
అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ హాల్‌లో ఓం శాంతి మంత్రం మార్మోగింది. ప్రపంచ నేతలు ప్రసంగించే విశ్వ వేదిక జనరల్‌ అసెంబ్లీ హాల్‌లో యోగా డే సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులు, అధికారులు, శిక్షకులు, గురువులు వివిధ ఆసనాలు వేశారు. ఐరాస జనరల్‌ అసెంబ్లీ హాల్‌లో ఈ తరహాలో యోగా ఉత్సవం జరపడం ఇదే ప్రథమం.  

రాహుల్‌ ట్వీట్‌ కలకలం  
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు వివాదానికి దారితీశాయి. ఆర్మీకి చెందిన జాగిలాలు, వాటి శిక్షకులు యోగా చేస్తున్న ఫొటోలు పోస్ట్‌ చేసిన రాహుల్‌ వాటికి ‘నవ భారతం’ అనే వ్యాఖ్యను జోడించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. యోగా డేను అపహాస్యం చేశారని, ఆర్మీ బలగాలను రాహుల్‌ అవమానపరిచారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శించారు. ‘కాంగ్రెస్‌ ఎప్పుడూ వ్యతిరేక ధోరణితోనే ఉంటుంది. ట్రిపుల్‌ తలాక్‌కు మద్దతిచ్చినప్పుడే ఈ విషయం పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు యోగాడేను అపహాస్యం చేయడమే కాకుండా ఆర్మీ బలగాలను అవమానపరిచారు.

వారిలో సానుకూల ధోరణి పెరగాలని ఆశిస్తున్నాను’అంటూ అమిత్‌ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఓ సీనియర్‌ రాజకీయవేత్త యోగాడేను ఇలా అవమానపరచడం బాధాకరం. ఓటు బ్యాంకు రాజకీయాలే వారిని ఇలా భారతీయ సంస్కృతులు, సంప్రదాయాలను అవమానించేలా చేస్తున్నట్లు ఉంది’అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్‌ సహస్రబుద్ధి ట్విట్టర్‌లో దుయ్యబట్టారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నవ భారత్‌ అవతరించింది. తన ఆధ్వర్యంలో కొత్త కాంగ్రెస్‌ ఎలా ఉందో రాహుల్‌ గాంధీ ట్వీట్‌లో అర్థమైంది’అంటూ బీజేపీ అధికార ప్రతినిధి నళిన్‌ కోహ్లి ఎద్దేవా చేశారు. ‘రాహుల్‌కు జీవితం అంటే         ఓ జోక్‌గా మారింది. తన పెంపుడు కుక్కను గుర్తు చేసుకుంటూ పోస్టులు చేస్తున్నట్లు ఉన్నారు’ అంటూ చాలా మంది నెటిజన్లు     మండిపడుతున్నారు.
 

బ్రిటన్‌లోని స్టోన్‌హెంజ్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆసనాలు వేస్తున్న ప్రజలు


శిక్షకులతో కలిసి యోగా చేస్తున్న ఆర్మీ జాగిలాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top