ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌

Narendra Modi Cabinet Approves Ordinance On Triple Talaq - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ట్రిపుల్‌ తలాక్‌’పై నరేంద్ర మోదీ సర్కార్‌ మరో అడుగు ముందుకేసింది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ప్రత్యేకంగా ఆర్డినెన్స్‌ తీసుకరావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ‘ట్రిపుల్‌ తలాక్‌’పై ఆర్డినెన్స్‌తో పాటు పలు కీలక నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మంత్రి వర్గ నిర్ణయాలను న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాకు తెలిపారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకనే ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చామని వివరించారు. తలాక్‌ చెప్పిన వారికి మూడేళ్ల జైలు, భార్యకు భరణం ఇచ్చేలా ఆర్డినెన్స్‌ రూపొందించామన్నారు. ఆర్డినెన్స్‌ కింద అరెస్టయిన వ్యక్తికి మెజిస్ట్రేట్‌ వద్ద బెయిల్‌ పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. భార్య, రక్తసంబంధీకులు, స్నేహితులు మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, భార్య వాదనలు విన్న తర్వాతే బెయిల్‌పై మెజిస్ట్రేట్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

430 ట్రిపుల్‌ తలాక్‌ కేసులు
సుప్రీం కోర్టు ఉత్తర్వుల తర్వాత 430 ట్రిపుల్‌ తలాక్‌ కేసులు నమోదయ్యాయని, రాజ్యాంగపరంగా అత్యవసరం కాబట్టే ఆర్డినెన్స్‌ తెచ్చామని వివరించారు. బిల్లు కోసం కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కోరేందుకు ‍ప్రయత్నించామని పేర్కొన్నారు. ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం కాంగ్రెస్‌ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు మద్దతివ్వడంలేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఈ కేసులు నమోదయ్యాయన్నారు. మహిళలకు న్యాయం చేసేందుకే, వారి గౌరవం కోసమే ఈ బిల్లు తెచ్చామని అన్నారు. సోనియా, మాయావతి, మమతా బెనర్జీలు ఓటు బ్యాంక్‌ రాజకీయాలు వీడి ఈ బిల్లుకు మద్దతివ్వాలని రవిశంకర్‌ ప్రసాద్‌ కోరారు.

అంగన్‌ వాడీ, ఆశా వర్కర్ల జీతాల పెంపు
అంగన్‌ వాడీ వర్కర్లు, సహాయక సిబ్బంది, ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ.3000 నుంచి రూ.4500కు పెంచేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. రాఫెల్‌ ఒప్పందంపై జెపిసి, సీఏజీ విచరణ అవసరం లేదని స్సష్టం చేశారు. రాఫెల్‌ విమానాల కొనుగోలుపై ఏ నిర్ణయం తీసుకోకుండా పదేళ్లు నానబెట్టారని గత కాంగ్రెస్‌ పాలకులపై మండిపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top