'నాకు సమన్లు అందాయి.. వివరణ ఇస్తా'
బెంగళూరు ఘటనపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వరరావు వివరణ ఇచ్చారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన గురువారం స్పందించారు.
బెంగళూరు: బెంగళూరు ఘటనపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర వివరణ ఇచ్చారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన గురువారం స్పందించారు. తాను అన్న మాటలను సందర్భోచితంగా తీసుకోలేదని అన్నారు. 'నేను దేనిని ఉద్దేశించి అన్నానో అలా నా మాటలు తీసుకోలేదు. ఆ రోజు జరిగింది ఓ దురుదృష్టకర సంఘటన. నాకు జాతీయ మహిళా కమిషన్ సమన్లు పంపించింది ఇచ్చింది. వాటికి నేను వివరణ ఇస్తాను. అలాగే, గవర్నర్ ఈ ఘటనకు సంబంధించి నా నుంచి వివరణ కోరారు. దానికి కూడా నేను సమాధానం ఇస్తాను' అని ఆయన గురువారం మీడియాకు బదులిచ్చారు.
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరులోని ఎంజీ రోడ్డులో మహిళలు, యువతులపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నాడు మంత్రిని వివరణ కోరగా ఆయన పోలీసులను వెనుకేసుకు రావడమే కాకుండా అక్కడి వచ్చిన యువత అంతా కూడా పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్నవారని, వారిలాగే దుస్తులు వేసుకున్నవారని, ఇలాంటి సందర్భాల్లో అలాంటివి జరుగుతుంటాయని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసందే. దీనిపై జాతీయ మహిళ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోపక్క, బెంగళూరులోని ఓ వీధిలో న్యూఇయర్ శుభాకాంక్షల పేరిట ఓ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడి సీసీటీవీ కెమెరాకు చిక్కిన ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు.


