బీఫ్‌ అమ్ముతున్నాడంటూ మూకదాడి

Muslim Man Abused Allegedly Selling Beef In Assam - Sakshi

గువాహటి : అసోంలో దారుణం చోటుచేసుకుంది. బీఫ్‌ అమ్ముతున్నాడనే కారణంగా ఓ ముస్లిం వ్యక్తిపై మూకదాడి జరిగింది. అతడిపై దాడికి పాల్పడ్డ కొంతమంది వ్యక్తులు పందిమాంసం తినాలంటూ ఒత్తిడి చేశారు. ‘నీ జాతి ఏమిటి. నువ్వు బంగ్లాదేశీవా. భారత పౌరులను గుర్తించే ‘నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌(ఎన్‌ఆర్‌సీ)’ లో నీ పేరు ఉందా’  అని అతడిని నిలదీశారు. ఏప్రిల్‌ 7న అసోంలోని బిస్వంత్‌ చరియాలిలో జరిగిన ఈ హేయమైన చర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇందుకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

షౌకత్‌ అలీ(68) గత 35 ఏళ్లుగా స్థానిక మార్కెట్లో ఈటరీ నడుపుతున్నాడని, ఈ క్రమంలో వారాంతాల్లో బీఫ్‌ అమ్ముతాడనే కారణంగా ఆదివారం అతడిపై దాడి జరిగిందని పేర్కొన్నారు. అలీతో పాటు మార్కెట్‌ మేనేజర్‌పై మూక దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు.. ‘ గత ఐదేళ్లలో మూకదాడులు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి ప్రతీ వీడియో నాకు బాధ కలిగిస్తోంది. అసోంలో బీఫ్‌ లీగలే.. కానీ అమాయక వ్యక్తులపై దాడికి పాల్పడటం ఇండియాలో ఇల్లీగల్’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వెలువరించిన మేనిఫెస్టోలో ఎన్‌ఆర్‌సీపై త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

చదవండి : ‘అసోం’లో అసలు ఏం జరుగుతోంది?

కాగా భారత పౌరులను గుర్తించే ‘నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌’  కారణంగా గత కొంతకాలంగా అసోంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలసవచ్చిన విదేశీయులకు వెళుతున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్‌ ఆఫ్‌ సాయిల్‌’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు ఆందోళన చేస్తున్నారు. తమ వెనకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని వలసదారులు తమ విలువైన భూములను కొల్లగొడుతున్నారంటూ 1960వ దశకం నుంచి ఆందోళన తీవ్రం చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలతోపాటు బంగ్లాదేశ్‌ యుద్ధానంతరం ఆ దేశీయులు అసోంలోకి వలస వచ్చారు. వాస్తవానికి బంగ్లా దేశీయులకన్నా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముస్లింలే అసోంలో ఎక్కువ ఉన్నారని పలు స్వచ్ఛంద సంస్థలు తమ అధ్యయనాల్లో తెలిపాయి. మణిపూర్‌ నుంచి వలసవచ్చిన వారు కూడా స్థానికంగా భూములు కొనుక్కొని స్థిరపడ్డారని ఆ సంస్థలు వెల్లడించాయి.  ఈ నేపథ్యంలో పలు మూకదాడులు జరుగుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top