మహారాష్ట్రపై వరుణుడి పంజా

Mumbai rains, All local trains operational, schools, colleges shut - Sakshi

నాలుగైదు రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వర్షాలు

సాక్షి, ముంబై: గత నాలుగైదు రోజులుగా విశ్రాంతి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆదివారం కూడా ముంబైతోపాటు యావత్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అనేక గ్రామాలు జలమయ్యాయి. ఇప్పటికీ అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో అందులో చిక్కుకున్న ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నీటిలో పాములు, తేళ్లు, ఇతర విష ప్రాణులు ఇళ్లలోకి రావడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. తాగునీరు ఆహారం లేక విలవిలలాడుతున్నారు.  

రైల్వే వ్యవస్థ అస్తవ్యస్థం.. 
భారీ వర్షాల కారణంగా రోడ్డు మార్గంతో పాటు రైల్వే వ్యవస్థ కూడా స్థంబించిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి ముంబై దిశగా వచ్చే అనేక రైళ్లను నాసిక్, ఇగత్‌పురి, కల్యాణ్, థానేలోనే నిలిపివేశారు. ఇందులో కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని రీ షెడ్యూల్‌ చేసి నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పట్టాలపై నిలిచిన నీటిమట్టం తగ్గకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రైళ్లు రాకపోవడంతో స్టేషన్లలో ప్లాట్‌ఫారాలపై ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఏ రైలు ఎప్పుడొస్తుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వర్షాల ప్రభావం దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్, మెయిల్‌ రైళ్లతోపాటు దూరాంతో రైళ్లను సైతం నిలిపివేశారు. వర్షం ప్రభావం లోకల్‌ రైళ్ల రాకపోకలపై కూడా పడింది. నీటిలో రైల్వే ట్రాక్, ట్రాక్‌ చేంజింగ్‌ యంత్రాలు, సిగ్నల్‌ ప్యానెళ్లు మునిగిపోవడంతో కల్యాణ్‌–కర్జత్‌ స్టేషన్‌ల మధ్య అవి పనిచేయకుండా పోయాయి. రైల్వే ట్రాక్‌ల కిందున్న కంకర, మట్టి కొట్టుకుపోవడంతో రైల్వే అపార నష్టం వాటిళ్లింది. ఈ ప్రాంతంలో రైళ్లను పునరుద్ధరించడానికి కనీసం రెండు రోజుల సమయం పట్టే అవకాశముందని అధికారులు  వెల్లడించారు.  

నిలిచిన లోకల్‌రైళ్లు.. 
నగరంలో పశ్చిమ మార్గం మినహా సెంట్రల్, హార్బర్‌ రైల్వే మార్గాలు ఆదివారం ఉదయం నుంచి స్తంభించిపోయాయి. అదృష్టవశాత్తు ఉద్యోగులకు, విద్యార్థులకు ఆదివారం సెలవు కావడంతో అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు. శనివారం సాయంత్రం కార్యాలయాల్లో చిక్కుకున్న అనేక మంది ఉద్యోగులు, వ్యాపారులు ఆదివారం ఉదయం ఇళ్లకు చేరుకున్నారు. లోకల్‌ రైళ్లు నిలిచిపోవడంతో దాదాపు అన్ని స్టేషన్లలో ఇసుకపోస్తే రాలనంత జనం ఉన్నారు. థానే, కల్యాణ్, అంబర్‌నాథ్, బద్లాపూర్‌ స్టేషన్‌లలో రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన నీరు తగ్గుముఖం పట్టలేదు. దీంతో ఆదివారం కూడా శనివారం పరిస్థితి నెలకొంది. అత్యవసరమైతే తప్ప ముంబైకర్లు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలోని కుర్లా, సైన్‌ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌పై నీరు చేరడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. గత్యంతరం లేక నగరం బయట దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపివేయాల్సి వచ్చింది. రైల్వే ద్వారా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్‌ చేయకపోవడంతో ప్లాట్‌ఫారంపై పడిగాపులు కాస్తున్న ప్రయాణికులకు ఆగ్రహం వ్యక్తం చేశారు.   

పాఠశాలలకు సెలవు.. 
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం పుణే, నాసిక్, థానేలలో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. థానే జిల్లాలో రెండ్రోజులుగా వర్షాలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. సోమవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం నుంచి ఉప్పు భూముల్లో చిక్కుకున్న దాదాపు 400 మందిని ఆదివారం మధ్యాహ్నం హెలికాప్టర్‌ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాసిక్, త్రయంబకేశ్వర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా గంగాపూర్, దారణా డ్యాముల్లోకి భారీగా నీరు రావడం మొదలైంది. పంటపొలాలన్ని జలమయమయ్యాయి. నాసిక్‌లో పంచవటి పుణ్య క్షేత్రం నీటిలో చిక్కుకుంది. నదులన్నీ ప్రమాద సూచికలను దాటి ప్రవహించడంతో పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆయా జిల్లా యంత్రాంగాలు హెచ్చరించాయి. ఇప్పటికే అనేక కుటుంబాలను పాఠశాలల భవనాలకు తరలించారు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు బాధితులకు తాగు నీరు, అల్పాహారం అందించి మానవత్వాన్ని చాటుకున్నాయి. 

ప్రయాణికుల నరకయాతన 
ముంబై నుంచి పుణే దిశగా బయలుదేరిన డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 21 గంటలు గడచిన పుణే చేరుకోకపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ఈ రైలును కల్యాణ్‌ మీదుగా నుంచి వయా మన్మాడ్‌ మీదుగా దారి మళ్లించారు. ఒక్కో స్టేషన్‌లో గంటల తరబడి నిలపడంతో ప్రయాణికుల వెతలు వర్ణనాతీతంగా మారాయి. శనివారం రాత్రి ఠాకూర్‌వాడి స్టేషన్‌ సమీపంలోని మంకీ హిల్‌ వద్ద రైల్వే ట్రాక్‌లపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సీఎస్‌ఎంటీ నుంచి సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బయలుదేరిన ఈ రైలు 21 గంటలు గడిచిన పుణేకు చేరుకోలేకపోయింది.

గత్యంతరం లేక కొందరు రైలు దిగి బస్సుల్లో తమ ఇళ్లకు చేరుకున్నారు. డెక్కన్‌ క్వీన్‌తోపాటు దక్షిణ దిశగా వెళ్లే అధిక శాతం రైళ్లు పుణే మీదుగా వెళతాయి. కాని కొండచరియలు విరిగిపడటం వల్ల వయా నాసిక్, మన్మాడ్‌ మీదుగా నడపడంతో గందరగోళం నెలకొంది. ముంబై నుంచి పుణే మీదుగా వెళ్లాల్సిన అనేక రైళ్లు రాకపోవడంతో రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. వర్షం కారణంగా ఏ రైలు ఎప్పుడు వస్తుందో విచారణ కౌంటర్‌ సిబ్బంది కూడా సమాధానం సరిగా చెప్పలేక పోతున్నారు. దీంతో పుణే స్టేషన్‌లో వేలాది మంది ప్రయాణికులు ప్లాట్‌ఫారంపై పడిగాపులు కాస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top