నర్సు యూనిఫాంలో మేయర్ ప్రత్యక్షం

Mumbai Mayor Visits Hospital In Nurses Uniform - Sakshi

ముంబై : కోవిడ్‌-19 విస్తృత వ్యాప్తితో చిగురుటాకులా వణుకుతున్న ముంబై మహానగరంలో ప్రజల్లో ధైర్యం నింపేందుకు స్వయంగా నగర మేయర్‌ రంగంలోకి దిగారు. బీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే బీవైఎల్‌ నాయర్‌ ఆస్పత్రిని సిటీ మేయర్‌ కిషోరి పెడ్నేకర్‌ సోమవారం సందర్శించారు. ప్రాణాలకు తెగించి కరోనా మహమ్మారిని ముందుండి ఎదుర్కొంటున్న ఆస్పత్రి సిబ్బందిని ప్రోత్సహించేందుకు వారిలో ధైర్యం నింపేందుకు ఆమె నర్సు యూనిఫాంలో ప్రత్యక్షమయ్యారు. గతంలో నర్సుగా పనిచేసిన కిషోరి పెడ్నేకర్‌ ఆస్పత్రిలోని నర్సులతో కలిసిపోయి వారిని ఉత్తేజపరిచారు. మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

తాను నర్సుగా పనిచేశానని, ఆ వృత్తిలో ఎదురయ్యే సవాళ్లపై తనకు అవగాహన ఉందని ఆమె పేర్కొన్నారు. తాను వారి పక్షాన ఉన్నానని చాటేందుకే ఆ యూనిఫాంతో వచ్చానని చెప్పుకొచ్చారు. ఈ సంక్లిష్ట సమయంలో మనందరం ఒకరికొకరు తోడుగా నిలవాలని, ఆ భరోసా ఇచ్చేందుకే తాను ఆస్పత్రిని సందర్శించానని ఆమె వెల్లడించారు. కాగా సామాజిక దూరం పాటిస్తూ మేయర్‌ ఆస్పత్రి సందర్శన సాగిందని బీఎంసీ అధికారి తెలిపారు. కిషోరి పెడ్నేకర్‌ తండ్రి మిల్లు కార్మికుడు కాగా, నర్సుగా ఆమె కెరీర్‌ను ప్రారంభించి 1992లో శివసేన మహిళా విభాగంలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2002లో బీఎంసీకి కౌన్సిలర్‌గా ఎన్నికైన పెడ్నేకర్‌ ఆ తర్వాత వరుసగా 2012, 2017లోనూ ఎన్నికయ్యారు. బీఎంసీ అధికారులు నిర్వహించిన హెల్త్‌ క్యాంప్‌లో 53 మంది ముంబై జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమె వారం రోజుల పాటు తన అధికార నివాసంలో క్వారంటైన్‌లో గడిపారు. 

చదవండి : లాక్‌డౌన్‌: నెల రోజులు.. డ్యాన్స్‌ చేసిన డాక్టర్లు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top